Anand Mahindra: కొత్త ఆలోచన పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. అదే పరిష్కారం..
Bengaluru Water Crisis: భారతీయ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి పొందిన బెంగళూరు నగరాన్ని ప్రస్తుతం నీటి ఎద్దడి సమస్య కమ్మేసింది. అందమైన నగరాన్ని నీటి కొరత తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తోంది.
టెక్ మహానగరంలో ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, బడా కంపెనీలు నీరులేక ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కొత్త ఆలోచనను పంచుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను షేర్ చేస్తూ ప్రజలకు ఒక ముఖ్యమైన సూచన చేశారు.

వేసవి కాలం వచ్చేసింది. ప్రస్తుతం ప్రజలు ఎండతాకిడిని తట్టుకునేందుకు ఏసీలను అధికంగా వినియోగిస్తుంటారు. అయితే ఎయిర్ కండీషనర్ల నుంచి బయటకు వచ్చే నీటిని ఆదా చేసే వినూత్న పద్ధతిని అందరితోనూ పంచుకోవాలని ఒకరు చేసిన వీడియో ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ప్రతిరోజూ ఏసీల నుంచి వచ్చే నీటిని సేకరించడానికి సులభమైన మార్గాన్ని వివరిస్తున్న వీడియో ప్రస్తుత బెంగళూరు నీటి ఎద్దడిలో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పబడింది. ఇందులో ఏసీ యూనిట్ నుంచి బయటకు వచ్చే నీటిని ఒక పైప్ లోకి నిండేలా ఏర్పాటు చేసి దానికి ఒక ట్యాప్ బిగించారు. కేవలం బెంగళూరుకు మాత్రమే దీనిని పరిమితం చేయకుండా దేశంలోని ప్రజలందరూ ఇలా నీటిని సేకరించి వినియోగించుకోవాలని సూచించారు.
ఏసీ యూనిట్ల నుంచి వచ్చే నీరు దాదాపు డిస్టిల్డ్ వాటర్ లాంటిది. అందువల్ల వీటిని మెుక్కలకు నీరు పెట్టేందుకు, ఇంట్లో నేల తుడుచుకునేందుకు, ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని వీడియో సూచించటాన్ని ఆనంద్ మహీంద్రా ప్రశంశించారు. టెక్ నగరానికి ప్రజల తాకిడి పెరుగుతున్న వేళ గత కొన్నేళ్లుగా ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమౌతున్నారు. జనభా పెరుగుదలతో పాటు వాతావరణ మార్పులు నగరంలో నీటి కొరతను పెంచుతోంది. దీంతో చాలా మంది లారీల్లో నీటిని కొనుగోలు చేస్తూ అధిక ధర చెల్లించాల్సి వస్తోందనే ఆరోపణను ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొట్టిపారేశారు.
బెంగళూరు విషయానికొస్తే నీటి ఎద్దడి లేదన్నారు. దాదాపు 7,000 బోరు బావులు మాత్రమే ఎండిపోయాయి. వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. నీటి ట్యాంకర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉందని, నీటి వనరులను గుర్తించామన్నారు. అందరికీ సక్రమంగా నీరు అందేలా ప్రభుత్వం చూస్తుందన్నారు. అయితే ప్రజలు మాత్రం నీటి సమస్య తమను వెంటాడుతోందంటూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో అపార్ట్ మెంట్లలో డిస్పోజబుల్ ప్లేట్లు, టంబ్లర్లు వాడుతూ నీటి వినియోగాన్ని వీలైనంత తగ్గిస్తున్నారు.


Click it and Unblock the Notifications