ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోంది. అతలాకుతలం చేస్తోంది. సంక్షోభ పరిస్థితులకు కారణమైంది. ఇదివరకెప్పుడూ లేనంతగా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా పడింది. లక్షల కొద్దీ కేసులు పుట్టుకుని వస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా 32 లక్షలకు పైగా కరోనా వైరస్ యాక్టివ్ కేసులు నమోదైన ప్రస్తుత పరిస్థితుల్లో.. వారందరికీ వైద్య చికిత్సను అందించడం కష్టసాధ్యమౌతోంది. ఆసుపత్రులు చాలట్లేదు. ఆక్సిజన్ కొరత దేశాన్ని వెంటాడుతోంది. ప్రాణవాయువు అందక పదుల సంఖ్యలో పేషెంట్లు మృత్యువాత పడుతున్నారు.
ఈ పరిస్థితిని అధిగమించడానికి దేశవ్యాప్తంగా ఉన్న పలు ఉక్కు కర్మాగారాలు, ఎరువుల తయారీ ఫ్యాక్టరీలు మెడికల్ ఆక్సిజన్‌ను యుద్ధ ప్రాతిపదికన తయారు చేస్తోన్నాయి. ఆ ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రులకు తరలించడం ఎలా అనే విషయంపై దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను చేపట్టింది. ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయడానికి ప్రత్యేకంగా ఆక్సిజన్ ఆన్ వీల్స్ (Oxygen on Wheels) ప్రాజెక్ట్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ ప్రాజెక్ట్ కింద పెద్ద ఎత్తున మహీంద్రా ట్రక్కులను వినియోగిస్తోంది. ఆక్సిజన్ సిలిండర్లను తరలించడానికి మాత్రమే వాటిని వినియోగించుకునేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి- కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లక్షల్లో ఉన్న మహారాష్ట్రపై తన దృష్టిని కేంద్రీకరించింది ఆ కంపెనీ. ముంబై, పుణె, ఛకన్, థానె, నాసిక్, నాగ్‌పూర్‌లను కేంద్రంగా చేసుకుని మహీంద్రా ట్రక్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయా కేంద్రాల ద్వారా అవసరమైన ప్రదేశాలకు ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయడానికి ట్రక్కులను పంపిస్తారు.
ఆసుపత్రుల్లోని ఎస్ఓఎస్ నెట్‌వర్క్‌తో వాటిని అనుసంధానం చేశారు. ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే సంబంధిత ఆసుపత్రికి ఈ కేంద్రాల నుంచి జంబో ఆక్సిజన్ సిలిండర్లు తరలి వెళ్తాయి. ఇప్పటికే 13 ఆసుపత్రులకు 61 జంబో సిలిండర్లను తరలించినట్లు మహీంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్రాజెక్టుపై ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. మహీంద్రా ట్రక్కులు, సిబ్బందితో కూడిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ఈ సంక్షోభ సమయంలో మరణాల సంఖ్యను తగ్గించడానికి ఆక్సిజన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని, వాటిని యుద్ధ ప్రాతిపదికన రవాణా చేయడానికి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications