Anand Mahindra, Anuradha: హైదరాబాద్లోని యూనివర్సిటీకి రూ.300 కోట్ల విరాళం ఇచ్చిన ఆనంద్ మహీంద్ర దంపతులు..
ఆనంద్ మహీంద్రా దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. ఆనంద్ మహీంద్రా, అనురాధ దాదాపు రూ.300 కోట్ల విలువైన మహీంద్రా & మహీంద్రా (M&M) షేర్లను మహీంద్రా యూనివర్సిటీకి ఎండోమెంట్ (నిధి) రూపంలో అందించినట్లు యూనివర్సిటీ తెలిపింది. ఈ తాజా విరాళంతో వారు గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 2024 మార్చిలో ఆనంద్ మహీంద్రా, వారి కుటుంబం మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు హామీని పూర్తి చేశారు. ఈ నిధి యూనివర్సిటీ యొక్క విద్య. సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని యూనివర్సిటీ తెలిపింది.
ఇందులో మౌలిక సదుపాయాల కల్పన, స్కాలర్‌షిప్‌లు, పరిశోధన గ్రాంట్లు, విద్యార్థులకు ఆర్థిక సహాయం, విద్యాపరమైన కార్యకలాపాలు వంటివి ఉంటాయని పేర్కొంది.
మహీంద్రా యూనివర్సిటీ (MU)కు మహీంద్రా & మహీంద్రా (M&M)కు చెందిన 6,50,270 ఈక్విటీ షేర్లు అందాయి. అలాగే, మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ (MEI)కు అదనంగా 2,16,757 M&M షేర్లు లభించాయి. మొత్తంగా చూస్తే ఈ విరాళంలో 8,67,027 M&M ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఇవి కంపెనీ మొత్తం ఓటింగ్ షేర్ క్యాపిటల్‌లో 0.07%కి సమానం. ఈ విరాళం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎండోమెంట్‌గా ఇచ్చారు.

దీనికి సంబంధించి అనురాధ మహీంద్రా లేదా ఆనంద్ మహీంద్రాకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనం చేకూరదని యూనివర్సిటీ పేర్కొంది. ఈ సందర్భంగా అనురాధ, ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. "విద్యకు మా కుటుంబంలో ఎప్పుడూ ఒక ముఖ్యమైన విలువగా ఉంటూ వచ్చింది. సమాజానికి మనం తిరిగి ఏమి ఇస్తామనే దానిలోనే, అలాగే తదుపరి తరానికి మనం కల్పించే అవకాశాలలోనే నిజమైన వారసత్వం దాగి ఉంటుందని మేము ఎప్పటి నుంచో నమ్ముతున్నాము. ఆ నమ్మకమే మార్చి 2024లో మహీంద్రా యూనివర్సిటీకి ఈ వాగ్దానం చేసేలా మమ్మల్ని ప్రేరేపించింది" అని పేర్కొన్నారు.
అప్పటి నుంచి యూనివర్సిటీ ఎంతో పురోగతి సాధించిందని వారు తెలిపారు. "ఇది కొత్త విద్యా విభాగాలను ప్రారంభించింది, భారతదేశం, విదేశాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులను ఒకచోట చేర్చింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలతో భాగస్వామ్యాలను ఏర్పరచుకుంది. సుదీర్ఘకాలం నిలిచిపోయే ఒక సంస్థకు అవసరమైన పునాదులను ఇది స్థిరంగా నిర్మిస్తోంది" అని చెప్పారు. మహీంద్రా యూనివర్సిటీ మే 2020లో హైదరాబాద్‌లో స్థాపించారు. ఈ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్థాయిలలో ఏడు స్కూల్లు, ఎనిమిది కేంద్రాల ద్వారా 50కి పైగా ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications