ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చాలా రకాల ఉద్యోగాలను అది రీప్లేస్ చేస్తుందని చాలామంది భయపడుతున్నారు. దీనికితోడు పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా వరుసగా లేఆఫ్స్ ప్రకటిస్తుండడంతో చాలామంది ఏఐ గురించి టెన్షన్ పడుతున్నారు. అయితే ఏఐ కంటే ప్రమాదకరమైన విషయం మరొకటి ఉందని ఆనంద్ మహింద్రా రీసెంట్ గా ట్వీట్ చేశారు. ఇంతకీ అదేంటంటే..

ఏఐ గురించి ప్రపంచవ్యాప్తంగా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే వీటికి భిన్నంగా ఆనంద్ మహింద్రా కొత్త కోణాన్ని బయటపెట్టారు. ఏఐని మించిన సంక్షోభం మరొకటి ఉందని చెప్తున్నారు. " ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయని మనం భయపడుతున్నాం. కానీ అంతకన్నా పెద్ద సంక్షోభాన్ని మర్చిపోతున్నాం" అని ఆయన ట్వీట్ చేశారు. అదే నైపుణ్యవంతులైన శ్రామికుల కొరత అని పేర్కొన్నారు. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ఫోర్డ్ సీఈవో జిమ్ ఫార్లే పాడ్ కాస్ట్‌ను కోట్ చేస్తూ ఎక్స్ లో ఈ పోస్ట్ చేశారు.
స్కిల్డ్ లేబర్ కొరత
ఇటీవలే ఫోర్డ్ సీఈవో ఒక పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ తమ కంపెనీలో 5 వేల మంది మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో చాలా పోస్టులకు లక్ష డాలర్ల (రూ.1 కోటి) శాలరీ ఉందని, అయినప్పటికీ ఆ ఉద్యోగాలు భర్తీ కాలేదని చెప్పుకొచ్చారు. దీన్ని ప్రస్తావిస్తూ ఆనంద్ మహింద్రా ఈ పోస్ట్ చేశారు. "అమెరికాలో ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫ్యాక్టరీ రంగాల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. మనం దశాబ్దాలుగా డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలకు ఎక్కువ వాల్యూ ఇస్తూ వచ్చాం, నైపుణ్యం గల శ్రామిక శక్తిని అంతగా పట్టించుకోలేదు" అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. స్కిల్డ్ లేబర్ వర్క్ ను ఏఐ భర్తీ చేయలేదని, వీటికి నేర్పు, శిక్షణతో కూడిన అనుభవం, నైపుణ్యం అవసరమవుతాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఫ్యూచర్ వీళ్లదే..
ఫ్యూచర్ లో ప్రజలు డ్రీమ్ కెరీర్స్ గా భావించే వాటిలో సమూల మార్పులు చూడబోతున్నామని, ప్రపంచాన్ని నడిపించగల శ్రామికులే వచ్చే ఏఐ యుగంలో అతిపెద్ద విజేతలుగా నిలుస్తారని కూడా ఆయన పోస్ట్ లో రాసుకొచ్చారు. హింస ద్వారా కాకుండా నైపుణ్యంతో ఏర్పడిన విప్లవం ఇది అంటూ ఆయన ట్వీట్ ను ముగించారు.
ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే..
ఇకపోతే ఏఐతో ఉద్యోగాలు పోతాయి అన్న విషయంపై ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది. కొందరు వైట్ కాలర్ ఉద్యోగాలపై దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని అంటుంటే.. మరికొందరు ఏఐని సక్రమంగా ఉపయోగించాలంటే మానవ జోక్యం తప్పనిసరిగా అవసరమవుతుందని, ఏఐ స్కిల్స్ నేర్చుకునేవారికి మంచి అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications