కరోనా ఎఫెక్ట్: కొనాలా వద్దా.. బంగారం కొనుగోలుపై గందరగోళం
బంగారం ధరలు తరుగుతూ, పెరుగుతున్నాయి. గత మూడు రోజులు పాటు పెద్ద మొత్తంలో తగ్గిన పసిడి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. వరుసగా ఐదు రోజుల పాటు ధరలు తగ్గి సోమవారం ముంబైలో 10 గ్రాములకు రూ.39,995కి దిగి వచ్చింది. కానీ ఈ రోజు (మార్చి 17) మళ్లీ పెరిగాయి. కరోనా వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం బంగారంపై పడుతోంది.

బంగారంపై ఇన్వెస్టర్ల గందరగోళం
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృతులు, బాధితులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు తొలుత సురక్షిత పెట్టుబడి బంగారం వైపు చూశారు. ఆ తర్వాత మహమ్మారి మరింత ఎక్కువ కావడంతో బంగారం కంటే నగదు రూపంలో దాచుకోవడం మంచిదని భావించి అమ్మకాలకు దిగారు. అయితే ఇప్పుడు మళ్లీ పసిడి వంటి అతి ఖరీదైన లోహాల వైపు మళ్లీ చూస్తున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. మొత్తానికి బంగారంపై పెట్టుబడి విషయంలోను ఇన్వెస్టర్లు కాస్త గందరగోళంలో ఉన్నారు.

గందరగోళానికి మరో కారణం...
బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనుకాడేందుకు మరో కారణం.. ధరలో హెచ్చుతగ్గులు. హఠాత్తుగా పెరుగుతూ.. ఆ తర్వాత తగ్గుతున్నాయి. దీంతో కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు సద్దుమణిగితే బంగారం ధరలు ఎలా ఉంటాయో అనే ఆందోళన అందరిని గందరగోళానికి గురి చేస్తోంది.

ధరలు తగ్గడంతో పెరిగిన డిమాండ్.. అందుకే
నాలుగైదు రోజుల పాటు బంగారం ధరలు తగ్గాయి. ఈ ఐదు సెషన్‌లలో దాదాపు రూ.4వేలకు పైగా తగ్గింది. భారీగా పెరుగుతూ రూ.45వేలకు చేరుకోవడంతో కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1700 డాలర్లకు పైకి చేరుకుంది. ఇప్పుడు 1550 డాలర్లకు లోపు ఉంది. ధరలు తగ్గడం వల్ల కూడా డిమాండ్ పెరిగి, కొనుగోళ్లు పెరిగాయి.


Click it and Unblock the Notifications