డాలర్ మారకంతో రూపాయి అదుర్స్, కారణాలివే! మళ్లీ బలహీనపడుతుందా?
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం బారీ లాభాల్లో ముగిశాయి. ఈ వారం మొత్తం లాభాల బాటలోనే నడిచాయి. ఆర్థిక, బ్యాంకింగ్, ఐటీ రంగాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలతో మార్కెట్లు ఆరువారాల గరిష్టానికి చేరుకున్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభపడి 32,720 వద్ద, నిఫ్టీ 712 పాయింట్లు లాభపడి 9,553 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇక డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 4 వారాల గరిష్టానికి చేరుకుంది. 52 పైసలు పెరిగి 75.66 వద్ద ట్రేడ్ ముగిసింది.

అందుకే రూపాయి బలపడింది
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై నిర్ణయం నేపథ్యంలో విదేశీ కరెన్సీలతో పోల్చితే డాలర్ బలహీనపడటం, మన స్టాక్ మార్కెట్ భారీ లాభాలు సాధించడం, వివిధ దేశాల్లో లాక్ డౌన్ దశలవారీగా ఎత్తివేస్తుండటం తదితర కారణాలతో రూపాయి 52 పైసలు బలపడింది. ఈ వారంలో మూడు రోజుల్లో రూపాయి 80 పైసలు(దాదాపు 1 శాతం మేర) బలపడింది.

నెల రోజుల గరిష్టానికి రూపాయి
తద్వారా నెల రోజుల గరిష్టానికి చేరుకుంది. మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం వ్యాల్యూ 76.18 వద్ద క్లోజ్ అయింది. బుధవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసల లాభంతో 75.94 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 75.60-75.96 గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య కనిపించింది. చివరకు 52 పైసల లాభంతో 75.66 వద్ద క్లోజ్ అయింది.

రిలయన్స్ - జియో ఒప్పందంతో కూడా రూపాయికి ఊతం
ఫెడ్ వడ్డీ రేట్లు, లాక్ డౌన్ ఎత్తివేతల వంటి నిర్ణయాల ఆశావాదంతో 75.60 నుండి 75.50 మధ్య కీలక మద్దతు లభించవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 76 లోపే ఉండవచ్చునంటున్నారు. లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో పాటు రిలయన్స్ జియో - ఫేస్‌బుక్ ఒప్పందం వల్ల డాలర్ ఫ్లో భారత కరెన్సీకి ఊతమిచ్చిందని ఎంకే గ్లోబల్ కరెన్సీ హెడ్ ఆఫ్ రీసెర్చ్ రాహుల్ గుప్తా అన్నారు.

తిరిగి బలహీనపడటం ఖాయమా?
అయితే రూపాయి ఎక్కువ కాలం బలపడకపోవచ్చునని, తిరిగి రూ.77కు కూడా చేరుకోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. 75.50 వద్ద కీలక మద్దతు లభించవచ్చునని, ఆ తర్వాత 75.30కు చేరుకొని, అనంతరం 76.50 లేదా 77 జోన్‌లోకి వెళ్లవచ్చునని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications