గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా జియో-వొడాఫోన్ వైపు ఎందుకు చూస్తున్నారు?
భారత టెలికం రంగంలోకి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్, వొడాఫోన్ ఐడియా సంస్థల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ గతంలో కొంత మొత్తాన్ని సమీకరించింది. తాజాగా వొడాఫోన్ ఐడియాపై గూగుల్ ఆసక్తి చూపిస్తుందనే వార్తల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు ఈ రోజు ఎగబాకాయి.

గూగుల్ ఎఫెక్ట్... వొడాఫోన్ జూమ్
దేశీయ స్టాక్ మార్కెట్లో వొడాపోన్ ఐడియా షేర్లు ఈ రోజు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఒక దశలో ఇవి 35 శాతం లాభపడ్డాయి. చివరకు దాదాపు 13 శాతం లాభంతో ముగిసింది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ ఐఎన్‌సీ ఈ సంస్థలో 5 శాతం వాటాను కొనుగోలు చేయనుందని వార్తలు రావడంతో ఈ షేర్లు పుంజుకున్నాయి. కొనుగోళ్ల ఒత్తిడి పెరిగి 35 శాతం లాభపడి రూ.7.85 వద్దకు చేరుకుంది. గత నెల రోజుల్లో ఈ షేర్ ధర 80 శాతం పెరిగింది. అల్భాబెట్ 110 మిలియన్ డాలర్లు వెచ్చించి 5 శాతం వాటాను దక్కించుకోనుందని చెబుతున్నారు. ఈ సంస్థ వ్యాల్యూ నాస్‌డక్‌లో 968.05 బిలియన్ డాలర్లుగా ఉంది.

జియోలోకి వెల్లువ
జియోలోకి కూడా గత నెల రోజుల్లో రూ.78వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫేస్‌బుక్ మధ్య రూ.43,574 కోట్లతో 9.99% వాటాను దక్కించుకుంది. అమెరికా ప్రయివేటు ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ రూ.5,655 కోట్లతో 1% వాటాను, విస్టా ఈక్విటీ రూ.11,367 కోట్లతో 2.3% వాటాను, జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్ రూ.6,598.38 కోట్లతో 1.34% వాటాను పొందాయి. కేకేఆర్ రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. వీటి ద్వారా 10 బిలియన్ డాలర్లు (1000 కోట్ల డాలర్లు) లేదా దాదాపు రూ.78,562 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మైక్రోసాఫ్ట్, ముబదాల కూడా చర్చలు జరుపుతున్నాయి.

టెలికం రంగంలోకి ఎందుకింత పెట్టుబడులు
టెలికం రంగంలో ఒకప్పుడు తీవ్రమైన పోటీ ఉంది. స్థిరీకరణ అనంతరం ఆ పోటీ బాగా తగ్గింది. ప్రధానంగా కేవలం మూడు కంపెనీలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. దేశంలో 135 కోట్ల మంది ప్రజలు ఉంటగా, మరో 20 కోట్ల మంది మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాల్సి ఉందనే అంచనాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో డేటా వినియోగానికి డిమాండ్ భారీగా పెరిగింది. అన్ని మొబైల్స్ కంపెనీల ఫలితాల్లో డేటానే కీలకం. దేశీయ టెలికం రంగానికి ఉన్న ఒకే ఒక సమస్య భారీ అప్పులు, సాంకేతికతను పెంచుకోవడానికి పెట్టుబడులు చొప్పిస్తున్న కంపెనీలు ఇందుకు ఎక్కువ అప్పులు చేయాల్సి వచ్చింది. ఇవి రుణాల్లో చిక్కుకుపోయాయి. టెలికం ఆదాయాలు మరింత పెరుగుతాయనే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు వస్తున్నారు.

డిజిటల్ వ్యాపారం
భారత్‌లో భవిష్యత్తులో డిజిటల్ వ్యాపారాలు ఊపందుకోనుందని భావిస్తున్నారు. దీంతో టెలికం షేర్లకు డిమాండ్ పెరుగుతోంది. సమీప భవిష్యత్తులోనే టెలికం రంగం మరింత కీలకం కానుందని భావిస్తున్నారు. గూగుల్ సంస్థ జియోతో కూడా చర్చలు జరిపిందని, ఆ తర్వాత వొడాఫోన్ ఐడియాతో చర్చలు జరుపుతోందని అంటున్నారు.


Click it and Unblock the Notifications