Amway India: ఆమ్వే ఇండియాపై ED చర్యలు.. మనీలాండరింగ్ కేసులో దూకుడు..
Amway India: దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ వ్యపారాన్ని నిర్వహిస్తోంది ఆమ్వే ఇండియా సంస్థ. అయితే ఈ కంపెనీ ప్రస్తుతం చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటోంది.
ఈ క్రమంలో ఆమ్వేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంది. ఏకంగా రూ.4,050 కోట్ల మనీలాండరింగ్ కేసులో కంపెనీపై హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. కంపెనీపై తెలంగాణ పోలీసులకు అనేక ఫిర్యాదులు అందాయని సమాచారం. కంపెనీ డైరెక్టర్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ప్రస్తుతం ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది.

ఆమ్‌వే ఇండియా.. మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ను అక్రమంగా ప్రచారం చేసిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది. ఇదొక పిరమిడ్ స్కీమ్ అని విచారణలో తేలింది. దీనిలో ఉన్నత శ్రేణిలో ఉన్నవారు ఎంతో లబ్ధి పొందుతున్నారని ఈడీ గుర్తించింది. వివిధ వస్తువుల విక్రయాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని.. దీనికోసం అధిక కమిషన్లను ఎరగా చూపుతున్నారని చాలా ఫిర్యాదులు వచ్చాయి. సభ్యులు పెరిగే కొద్ది పొందే కమిషన్ పెరుగుతుంది. ఈ స్కీమ్ ద్వారా ఆమ్వే అక్రమంగా రూ.4,050.21 కోట్లు ఆర్జించినట్లు విచారణలో తేలింది.
పైగా స్కీమ్ ద్వారా వచ్చిన మెుత్తంలో సగానికి పైగా అంటే రూ.2,859 కోట్లను విదేశాల్లో ఉన్న ఇన్వెస్టర్లకు పంచిపెట్టినట్లు ఈడీ గుర్తించింది. దీంతో కంపెనీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాడార్ పరిధిలోకి వచ్చింది. దీంతో కంపెనీకి చెందిన రూ.757.77 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీనిపై స్పందించిన కంపెనీ కేసు 2011 లోనిదని.. దర్యాప్తు అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నట్లు పేర్కొంది. దాదాపు 25 ఏళ్ల కిందట భారతదేశంలో కంపెనీ తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 2,500 మంది ఉద్యోగులు, 5.5 లక్షల మందికి పైగా పంపిణీదారులను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications