Market Next Week: ఈ వారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల అదృష్టం బాగందా? పూర్తి వివరాలివే..
Stock Market Updates: ప్రతివారం మాదిరిగానే దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఈవారం కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం డేటా ఆర్థిక మాంద్యం భయాలను తొలగించిన వేళ గతవారం గ్లోబల్ మార్కెట్లతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాలతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే రానున్న వారం ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలు ప్రపంచ ట్రెండ్, విదేశీ పెట్టుబడిదారుల వ్యాపార కార్యకలాపాల ద్వారా కొనసాగనున్నాయి. ఇప్పటికే అనేక కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈవారం విడుదల కానున్న US ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశ వివరాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రానున్న వారంలో జపాన్‌లోని ద్రవ్యోల్బణం డేటా, US FOMC సమావేశం వివరాలు ఇన్వెస్టర్లు గమనించదగినవిగా స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. అలాగే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులపై కూడా ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికాలో ద్రవ్యోల్బణం చాలాకాలం తర్వాత పరిమిత స్థాయి కిందకు రావటంతో పాటు బలమైన రిటైల్ అమ్మకాల డేటా, తగ్గిన నిరుద్యోగిత వంటి సానుకూల అంశాలు మాంద్యం భయాలను తగ్గించాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (పరిశోధన) ప్రశాంత్ తపసే పేర్కొన్నారు. వాస్తవానికి ఇది రానున్న వారంలో భారతీయ స్టాక్ మార్కెట్లను సానుకూలంగా ముందుకు నడిపించేందుకు దోహదపడే అంశాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో రానున్న కొన్ని నెలల్లో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చనే అంచనాలు భారతదేశంతో సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో పెద్ద ర్యాలీకి దారితీసిందని తపసే చెప్పారు.
రానున్న వారంలో గమనించాల్సిన విషయాల్లో జాక్సన్ హోల్ ఎకనామిక్ సింపోజియంలో US ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ ప్రసంగం కూడా ఒకటిగా ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ పాలసీ సమావేశం సమీపిస్తున్న వేళ 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు విస్తృతంగా అంచనా వేయబడినప్పటికీ, తగ్గుతున్న ద్రవ్యోల్బణం, లేబర్ మార్కెట్ బలహీనత సంకేతాలతో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు 50 బేసిస్ పాయింట్ల వరకు సాధ్యమైనదిగా కొందరు ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో దేశీయంగా గమనించాల్సిన ముఖ్య ఆర్థిక సూచికల్లో బ్యాంక్ రుణం, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, విదేశీ మారక నిల్వలతో పాటు ఆగస్టులో HSBC తయారీ & సేవల PMI డేటా ఉన్నాయి. ఇక ఐపీవోల కోలాహలం దేశీయ స్టాక్ మార్కెట్లలో నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.


Click it and Unblock the Notifications