Trump News: ట్రంప్ రాకతో మారిపోతున్న పరిస్థితులు.. మెటా నుంచి అమెజాన్ వరకు క్యూ..
Trump Victory: గడచిన నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి విజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించారు. అధ్యక్ష పదవి కోల్పోయిన తర్వాత మళ్లీ దానిని చేజిక్కించుకున్న వ్యక్తిగా నిలిచారు. ట్రంప్ అధికారంలోకి రావటానికి బిలియనీర్ ఎలాన్ మస్క్ భారీగా విరాళాలు అందించటంతో పాటు క్యాంపెయిన్ కూడా చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి అమెరికాలో ట్రంప్ రాక వలసదారులను తీవ్రంగా దెబ్బతీస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ట్రంప్ తన హయాంలో అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేందుకు విదేశీ పెట్టుబడిదారులను అమెరికాలో తమ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందింగా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై సుంకాలను పెంచుతానని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అంటూ తిరిగి తన రాకతో మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని ఆయన విక్టరీ స్పీచ్ లో వెల్లడించారు. అయితే ట్రంప్ ఈ చర్యలు అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది.

ట్రంప్‌కు టెక్ కంపెనీల విరాళాలు..
అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రారంభ నిధికి ఒక మిలియన్ డాలర్లను విరాళంగా అందజేస్తున్నట్లు అమెజాన్ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. టెక్ కంపెనీలు పరిపాలనతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవాలని చూస్తున్నందున ఈ వేడుకలకు సహకరించడంలో భాగమయ్యారు. ఇదే క్రమంలో తనను కలిసేందుకు జెఫ్ బెజోస్ వచ్చేవారం వస్తున్నట్లు కొత్త అధ్యక్షుడు ట్రంప్ సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అలాగే ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ట్రంప్‌ను కలిసిన సంగతి తెలిసిందే. టెస్లా, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌తో తనకున్న విస్తృత పరిచయాన్ని గుర్తించారని ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను కలిగి ఉన్న మెటా కూడా రిపబ్లికన్ ప్రారంభ నిధికి ఒక మిలియన్ డాలర్లను విరాళంగా అందించింది. దీంతో అమెరికాలోని టెక్ కంపెనీలు ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రీన్ కార్డ్ హోల్డర్ల పరిస్థితి..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత కథ మెుత్తం మారిపోతోంది. అందరూ ట్రంప్ ఈ సారి విదేశీయులను యూఎస్ నుంచి డిపోర్ట్ చేస్తారని భావిస్తే.. కొత్త ప్రెసిడెంట్ దానికంటే పెద్ద బాంబే పేల్చనున్నట్లు తేలింది. అయితే ఈ సారి ఆయన కన్ను గ్రీన్ కార్డ్ హోల్డర్లపై పడిందని తెలుస్తోంది. దీంతో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయం దాదాపు 10 లక్షల మంది భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపేదిగా తెలుస్తోంది.
ఇప్పటి వరకు అమెరికాలోని రూల్స్ ప్రకారం చట్టబద్ధమైన వలసదారులకు పుట్టిన పిల్లలకు ఆటోమెటిక్ గా యూఎస్ పౌరసత్వం వస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ఈ విధానానికి కొత్తగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలకటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. కొత్తగా తీసుకొస్తున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు ఆటోమేటిక్ US పౌరులుగా మారాలంటే కనీసం ఒక పేరెంట్ అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి అయి ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే జనవరి 20న అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్ ఆఫీస్ దీనిపై ఎలా ముందుకు వెళుతుందనే విషయం వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications