Liquor News: బీర్ ప్రియులకు షాక్.. బెంగళూరులో భారీగా పెరగనున్న ధరలు, వారి ఆందోళన..
Karnataka Beer: మరో నెల రోజుల్లో చలికాలం ముగింపుకు రాబోతోంది. ఇప్పటికే చాలా నగరాల్లో చలి గతంలో కంటే తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వేసవికి ముందు వడదెబ్బకంటే ముందు కర్ణాటకలోని లిక్కర్ ప్రియులకు రేట్ల దెబ్బ తగలటానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జనవరి 20, 2025 నుంచి అనేక కేటగిరీలకు చెందిన బీర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో కర్ణాటకలోని బీర్ ప్రియులు భారం పెరిగినప్పటికీ కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో 650 ఎమ్ఎల్ బీర్ ధర రూ.10 నుంచి రూ.45 వరకు పెరిగాయని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో భారీగా అమ్మకాలు జరిగినప్పటికీ రాష్ట్రంలో తగ్గిన ఆదాయాన్ని కవర్ చేసుకునేందుకు ధరలను ప్రభుత్వం పెంచాలని నిర్ణయించింది.

అదనపు ఎక్సైజ్ సుంకం బిల్లింగ్ ధరలో 185% నుంచి 195% లేదా బల్క్ లీటర్‌కు రూ.130 వరకు ఉంటుందని వెల్లడైంది. కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న ధరల పెంపు నిర్ణయం కారణంగా గతంలో రూ.100గా ఉన్న బీర్ ధర ప్రస్తుతం రూ.145కి పెంచబడింది. అలాగే రూ.230 ధర గతంలో ఉన్న బీర్ ప్రస్తుతం రూ.240కి పెరిగిందని వెల్లడైంది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో అమ్మకాలు 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లు ప్రతికూలంగా ఉన్న సమయంలో ఈ ధరల పెంపు వచ్చిందని వైన్ మర్చంట్స్ అసోసియేషన్ల సమాఖ్య అధ్యక్షుడు కరుణాకర్ హెగ్డే అన్నారు.
రేట్ల పెంపుకు ముందు గడచిన వారం రోజుల నుంచి సరఫరా నిలిచిపోయిందని కరుణాకర్ వెల్లడించారు. బ్రూవరీ సంస్థలు కూడా ఉత్పత్తిని తగ్గించాయి. ఇది కర్ణాటక వ్యాప్తంగా మార్కెట్లో బీర్ల షార్టేజ్ క్రియేట్ చేసిందని వ్యాపారులు చెబుతున్నారు. ఒక పక్క ధరల పోటుతో పాటు మరోపక్క బీర్లు మార్కెట్లో అందుబాటులో లేకపోవటం అమ్మకాల తగ్గుదలకు కారణమైందని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉద్యోగ భద్రత లేకపోవటంతో పాటు లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ ఉద్యోగులు జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారని కోరమంగళాకు చెందిన ఒక వ్యాపారి వెల్లడించారు. దీంతో అమ్మకాలు తగ్గి లాభాలు కూడా తగ్గిపోతున్నాయని వారు వాపోతున్నారు. ధరల మార్పుల కారణంగా చేస్తున్న లేబులింగ్ మార్పుల వల్ల రానున్న 40 రోజుల వరకు మార్కెట్లోకి బీర్ల సరఫరా తగ్గుదుందని ఇది వైన్స్ వ్యాపారులకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బెంగళూరులోని పబ్ ఓనర్లు సైతం సంతోషంగా లేరని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications