Apple News: దేశంలో కొత్తగా నాలుగు ఆపిల్ స్టోర్లు.. పూర్తి వివరాలివే..
Apple Stores: అమెరికాకు చెందిన ఐఫోన్ మేకర్ ఆపిల్ భారతీయ మార్కెట్లపై భారీగా దృష్టి సారించింది. 140 కోట్ల మంది జనాభా ఉన్న ఇండియ మార్కెట్ల నుంచి ప్రస్తుతం కంపెనీ సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో సూపర్ లాభాలను నమోదు చేసింది. ఐప్యాడ్ విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని యాపిల్ సీనియర్ అధికారులు తెలిపారు. దీంతో కంపెనీ మొత్తం నికర అమ్మకాలు 6 శాతం వృద్ధి చెంది 7.98లక్షల కోట్లకు చేరిందని ఆపిల్ తెలిపింది.
రెండవ త్రైమాసికంలో అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్‌తో పాటు యూఎస్, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, బ్రిటన్, కొరియా, మలేషియా, థాయ్‌లాండ్‌తో సహా పలు దేశాల్లో రికార్డు స్థాయిలో ఆదాయాలను చూసినట్లు సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఆపిల్ ఐఫోన్ విక్రయాల ద్వారా వచ్చే విలువ పరంగా మార్కెట్ వాటాలో 21.6శాతంగా ఉన్నాయి. అలాగే విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 4.12శాతం వృద్ధి చెందింది. ఐఫోన్ అమ్మకాలు 5.5 శాతం పెరుగుదలను చూశాయి. చైనా నుంచి అమ్మకాలు మందగించటంతో భారతీయ మార్కెట్లపై ప్రస్తుతం టిమ్ కుక్ ఫోకస్ కొనసాగుతోంది.

గడచిన ఏడాది ఇండియాలో ఆపిల్ తన సొంత స్టోర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దిల్లీ, ముంబై వంటి నగరాల్లో నేరుగా ప్రారంభించిన డైరెక్ట్ స్టోర్ల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఈ క్రమంలోనే సొంత స్టోర్ల ద్వారా విక్రయాలు మంచి హిట్ కావటంతో కంపెనీ తాజాగా మరో 4 స్టోర్లను పెట్టాలని చూస్తోంది. ఐఫోన్ విక్రయాలు భారత్‌లో భారీగా పెరగటానికి ప్రధాన కారణం ఆపిల్ ప్రారంభించిన సొంత విక్రయ కేంద్రాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆపిల్ ఉత్పత్తులపై భారతీయ ప్రజల్లో భారీగా ఆసక్తి ఉందని.. మమ్మల్ని మరింత ప్రేరేపిస్తుందని టిమ్ కుక్ పేర్కొన్నారు. భారత్‌లోనే కాకుండా మెక్సికో, బ్రెజిల్, మిడిల్ ఈస్ట్ దేశాలు, దక్షిణాసియా దేశాల్లో కూడా తమ కంపెనీ రెండంకెల వృద్ధిని సాధించిందని ఈ సందర్భంగా వెల్లడించారు.
భారతీయ కస్టమర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మరో నాలుగు సొంత రిటైల్ విక్రయ కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆపిల్ సీఈవో వెల్లడించారు. కంపెనీ డైరెక్ట్ సేల్స్ అవుట్‌లెట్లను తెరవడంతో పాటు ఇండియాలో తమ ఐఫోన్ల ఉత్పత్తిని కూడా పెంచింది. ఆర్థిక సంవత్సరం మెుదటి 6 నెలల కాలంలో ఇండియాలో తయారు చేయబడిన, ఎగుమతి చేయబడి ఆపిల్ ఉత్పత్తుల విలువ రూ.50 వేల కోట్లు దాటింది. అంచనాల ప్రకారం కంపెనీ తన కొత్త రిటైల్ స్టోర్లను పూణే, బెంగళూరు, ముంబై, దిల్లీ-ఎన్సీఆర్ లలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ కొనసాగుతున్న వేళ అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ఐఫోన్ ఏఐ ఫీచర్స్ అమ్మకాలను పెంచటంతో పాటు బలమైన ప్రారంభాన్ని అందిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications