Akshaya Tritiya: పసిడి ప్రియులకు పండుగ.. వచ్చే నెల అక్షయ తృతీయ.. గెట్ రెడీ..
Akshaya Tritiya 2024: భారతదేశంలోని హిందువులు ఉత్సాహంగా జరుగుపునే పండుగల్లో అక్షయ తృతీయ కూడా ప్రధానమైనది. చాలా మంది ఈరోజు బంగారం, వెండి ఆభరణాలను కొంటుంటారు.
అయితే ఈ ఏడాది పసిడి, వెండి ధరలు ఊహలకు సైతం అందనంత భారీగా పెరిగిన వేళ భారతీయ ప్రజల్లో సంతోషం పెద్దగా కనిపించటం లేదు. 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే 72 వేల మార్కుకు పైనే కొనసాగుతుండగా.. వెండి దాదాపు రూ.90 వేలకు సమీపంలోనే కొనసాగటం సామాన్యులను సాంప్రదాయ పడుగకు ఈ సారి దూరం చేస్తోంది. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10న ఉంది. ఈరోజు చాలా మంది తమకు అవసరమైన వెండి, బంగారం నగలతో పాటు ఇళ్లు, కార్లు, భూమి, గృహోపకరణాలు వంటి వాటిని కొంటుంటారు.

పురాణాల ప్రకారం అక్షయ తృతీయను విష్ణువు అవతారాల్లో ఒకరైన పరశురాముని పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి పుణ్యస్నానం చేసి పసుపు వస్త్రాలు ధరిస్తారు. ఈరోజున ధనానికి సంపదకు అధిపతి అయిన కుబేరుడు, శివుడు, లక్ష్మీ దేవికి చాలా మంది విశేష పూజలు చేస్తుంటారు. పైగా ఈరోజు దానధర్మాలు చేయటం, శుభకార్యాలు చేపట్టటం వంటి వాటిని భారతీయులు చేపడుతుంటారు.
మార్కెట్లలో గత కొంత కాలంగా పసిడి ధరల ర్యాలీతో గోల్డ్, సిల్వర్ ఆకాశానికి చేరిన వేళ అటు కొనుగోలుదారులతో పాటు ఇటు వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఈ సారి వ్యాపారం చాలా తక్కువగా ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. ప్రజలు పెరిగిన ఖర్చుల మధ్య పసిడి కొనుగోళ్లను నామమాత్రంగా ఉంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఈ సారి ఇప్పటికీ వ్యాపారాలు క్షీణించటంతో అక్షయ తృతీయపై కూడా ఇదే ప్రభావం ఉండే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ లెక్కన అక్షయ తృతీయ ఈ సారి కళ తప్పే అవకాశాలు మార్కెట్లో కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications