IT News: హైదరాబాద్ టెక్కీలకు వర్క్‌ఫ్రమ్ హోమ్..!! రంగంలోకి పోలీసులు..
Hyderabad News: గడచిన రెండు రోజులుగా ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రధాన నగరాలు జలమయం అయ్యాయి. రోడ్లు సైతం నీటితో మునిగిపోవటంతో ప్రజా జీవితం అస్థవ్యవస్థం అయ్యింది.
ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్ నగరం రెండు రోజులుగా ఎడతెరపిలేని కుండపోత వర్షాలను చూస్తోంది. ఇది ప్రజా రవాణా వ్యవస్థను సైతం దెబ్బతీసింది. ఈ తరుణంలో అధికారులు సైతం ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఈ చర్య రోడ్లపై అనవసరపు ట్రాఫిక్ ను నివారిస్తుందని వారు చెబుతున్నారు. అలాగే సహాయక చర్యలు వేగంగా నిర్వహించటానికి సైతం పౌరులు తమకు సహకరించాలని వారు సూచిస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణలోని అధికార యంత్రాంగం విద్యా సంస్థలకు వర్షాల కారణంగా సెలవులు ప్రకటించింది. అయితే అనేక ఐటీ కంపెనీలు మాత్రం ఇప్పటికీ తమ ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఆదేశాలను కొనసాగిస్తున్నాయి. ఈ తరణంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని అందించాలని తద్వారా వారు ఇళ్ల నుంచే పనిచేయగలుగుతారని లేఖ రాశారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయోల్ డేవిస్ దీనిపై టెక్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. అయితే వర్షాలతో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ వర్క్‌ఫ్రమ్ హోమ్ కొనసాగించవచ్చని తెలుస్తోంది.
ఇదే క్రమంలో ఏపీలోని విజయవాడను వరదలు ముంచెత్తుతున్నాయి. కృష్ణా నది సైతం ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో నగరంలోని బస్ స్టాండ్, లోతట్టు ప్రాంతాలు, కరకట్ట సహా మరిన్ని ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితులను సీఎం చంద్రబాబు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఆహారం, పాలు, కనీస అవసరాలు అందించేందుకు హెలికాఫ్టర్లు సైతం రంగంలోకి దింపారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీగా విజయవాడకు చేరుకుంటున్నాయి. కొన్ని గంటల సమయంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తాయని ప్రజలు సహకరించాలని మీడియా ముఖంగా సీఎం చంద్రబాబు సూచించారు. ఈ తరుణంలో రాజధాని ప్రాంతం సైతం నీటిలో చిక్కుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications