Sensex-Nifty: నేటి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ FOMC నిర్ణయానికి కొన్ని గంటల భారతీయ ఈక్విటీ మార్కెట్ల సూచీలు రికార్డు గరిష్ఠ స్థాయిలకు వేగంగా దూసుకెళ్లాయి. వాస్తవానికి ఉదయం ఫ్లాట్ ప్రారంభాన్ని చూసిన సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలో తమ సరికొత్త జీవితకాల గరిష్ఠాలను అందుకున్నాయి.
ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 83,315.93 పాయింట్లను తాకగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 25,481.60 గరిష్ఠాన్ని ఇంట్రాడేలో తాకింది. దీనికి బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ మద్దతుగా నిలిచింది.అయితే ఇదే క్రమంలో ఐటీ స్టాక్స్ క్షీణతను చూశాయి. నిఫ్టీ ఐటీ సూచీ కూడా 3 శాతం మేర పతనాన్ని చూసింది. వాస్తవానికి దీనికి కారణం ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఫెడ్ సమావేశానికి ముందే ఐటీ షేర్లలో లాభాల స్వీకరణను కొనసాగించటమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మధ్యాహ్నం 12.36 గంటల సమయంలో మార్కెట్లలో బజాజ్ ట్విన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం ఒడిదొడుకుల్లో ఫ్లాట్ ముగింపును చూస్తున్నాయి. ప్రారంభ మార్కెట్ ట్రేడింగ్‌లో దాదాపు 250 షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. ఈ క్రమంలో దాదాపు 300 షేర్లలో అప్పర్ సర్క్యూట్ ఏర్పడింది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు దాదాపు 4000 షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ ర్యాలీలో బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ కూడా రూ.470 లక్షల కోట్లకు పెరిగింది.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమావేశం ఈ రోజు అర్థరాత్రి ముగియనుంది. అయితే ఇందులో ఫెడ్ చైర్ పర్సన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు ప్రకటించవచ్చని అంచనా వేయబడుతోంది. అయితే ఇది 50 బేసిస్ పాయింట్లుగా కూడా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమాచారం ప్రకారం దాదాపు 65 శాతం మార్కెట్ విశ్లేషకులు ఫెడ్ సెప్టెంబర్ పాలసీలో 50 బేసిస్ పాయింట్లు తగ్గింపును ఊహిస్తున్నారు. కరోనా తర్వాత వడ్డీ రేటు తగ్గింపు ఇదే తొలిసారి కానుంది. దీనికి ముందు ఫెడ్ తన 11 పాలసీలలో రేట్లను 5% మేర క్రమంగా పెంచుతూ వచ్చింది. జూలై 2023 పాలసీ తర్వాత వడ్డీ రేట్లను యథాతథంగా ఫెడ్ కొనసాగిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
మార్కెట్లపై ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావాన్ని చూస్తే.. పాలసీలో వడ్డీ రేట్ల తగ్గింపు మార్కెట్‌కు పాజిటివ్ సంకేతంగా అందవచ్చు. దీంతో ఇన్వెస్టర్లు మరింత పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. ఫెడ్ నిర్ణయం ప్రభావంతో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు లాభం పొందవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది విదేశీ పెట్టుబడులు పెరిగే కూడా దారితీస్తుందని తెలుస్తోంది. యూరోపియన్, ఆసియాన్ మార్కెట్లతో సహా గ్లోబల్ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తే, భారత మార్కెట్లు బలపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications