LPG Prices: తగ్గిన ఆ గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..??
LPG Rate Cut: గత నెలలో దేశంలోని చమురు విక్రయ కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ సమయంలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.25 మేర పెంచాయి. ఈ క్రమంలో డొమెస్టిక్ సిలిండర్ల రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాయి.
తాజాగా మార్చి నెల ముగియటంతో ఏప్రిల్ నెల కోసం చమురు కంపెనీలు నేడు గ్యాస్ సిలిండర్ల ధరలను మార్చాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్, ఐదు కిలోల ఎఫ్‌టిఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పిజి) సిలిండర్ ధరలను చమురు కంపెనీలు నేడు తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.30.50 మేర తగ్గించడగా దేశ రాజధాని దిల్లీలో తాజా ధర రూ.1,764.50గా ఉంది. ఇదే క్రమంలో ఐదు కేజీల ఎఫ్‌టీఎల్ ధర ఇప్పుడు రూ.7.50 మేర తగ్గించబడింది.

మార్చిలో దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ను టన్నుకు రూ.3,300 నుంచి రూ.4,600కి కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పన్ను ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (SAED) రూపంలో విధించబడుతుంది. ఇదే సమయంలో డీజిల్ ఎగుమతిపై పన్ను లీటరుకు రూ.1.50 నుంచి సున్నాకి తగ్గించబడింది. ఇది కాకుండా పెట్రోల్, విమాన ఇంధనంపై పన్ను మునుపటిలా సున్నాగా ఉంచబడింది. అయితే ప్రస్తుతం సిలిండర్ ధరలను తగ్గించడానికి గల కారణాలను చమురు కంపెనీలు వెల్లడించలేదు.
గత నెల ఎన్నికల ప్రకటన రావటానికి కొన్ని రోజుల ముందు గృహ సిలిండర్ల ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మహిళా దినోత్సవ కానుకగా ఈ తగ్గింపును అభివర్ణించారు. ఎన్నికల సమయంలో వాణిజ్య వినియోగ సిలిండర్ల ధరలను తగ్గించడం చిన్న వీధి వ్యాపారులకు, పెద్ద కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు ప్రయోజనం కలిగి కొంత సానుకూలతను అందిస్తుందని అనేక మంది భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications