Anant-Radhika Wedding: ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం నేడు ముంబైలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పెళ్లికి అంబానీ ఫ్యామిలీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఆచారాలు దాదాపుగా పూర్తయ్యాయి. ముంబై నగరం అంబానీ కుమారుడి వివహవేడుకలతో హడావిడిగా మారిపోయింది.
అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా ప్రత్యేకంగా ముంబై ప్రజల కోసం ఏకంగా వివాహ వేడుకను 40 రోజుల పాటు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. దీని కింద అక్కడి ప్రజలకు రోజూ ఆహారాన్ని అందించాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. అనంత్-రాధికల వివాహానికి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ సిద్ధమైంది. ఈ రోజు వివాహం జరుగుతుండగా.. జూలై 13న శుభకార్యం, జూలై 14న వివాహ రిసెప్షన్ ఉండనున్నాయి.

అనంత్ అంబానీ పెళ్లి కార్యక్రమంలో భాగంగా అంబానీ కుటుంబం ఇప్పటికే 50 మందికి ఉచితంగా సామూహిక వివాహాలను జరిపించింది. ఈ వివాహంలో వధూవరులకు వివాహ కానుకగా బంగారు నగలు, లక్ష రూపాయల నగదు కూడా అందజేశారు. అయితే ముంబై ప్రజలకు జూన్ 5వ తేదీ నుంచి ఈ ఆహార విందును అందిస్తున్నారు. 15వ తేదీతో బండార్ కార్యక్రమం ముగియనున్నట్టు తెలుస్తోంది. రోజుకు 9,000 మందికి భోజనం పెట్టేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన వీడియోలో ప్రజలు ఆసక్తిగా వచ్చి తింటున్నారు.
ఈ క్రమంలో ఒకేసారి 4 వేల మంది వరకు కూర్చుని భోజనం చేసేలా టెంట్లు, ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చిన వారందరూ అనంత్ అంబానీకి తమ వివాహ శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేస్తారు. ఈ వివాహ విందులో రకరకాల వంటకాలు వడ్డిస్తున్నారు. అంబానీ కుటుంబం జూన్ 29 నుంచి గుజరాతీ సంప్రదాయ వివాహ వేడుకను నిర్వహిస్తోంది.
దీనికి ముందు అంబానీ కుటుంబం రెండు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లను నిర్వహించింది. ఈ రోజు జరగనున్న వివాహ వేడుకకు ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు సైతం పెళ్లి తర్వాత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు అంబానీ ఇంట వేడుకలో పాల్గొనేందుకు రేపు సాయంత్రం ముంబైకి వెల్లనున్నారు.


Click it and Unblock the Notifications