Pak Debt: సెంచరీ దాటిన పాక్ రుణభారం.. దొరికిన చోటల్లా అప్పులు.. చైనా, IMF దేన్నీ వదల్లే!
పొరుగు దేశం చైనా వంకర బుద్ధి ఈ మధ్యనే ప్రపంచానికి బోధ పడింది. రుణాల పేరిట పేద దేశాలను చెప్పుచేతల్లో పెట్టుకోవడం దానికి వెన్నతో పెట్టిన విద్య. దాని అకృత్యానికి బలైపోయిన పాకిస్థాన్ పరిస్థితి దీనంగా తయారైంది. కొత్త అప్పులు దొరక్కపోవడంతో పాటు మిత్ర దేశాలు మొహం చాటేయడంతో ఎటూపాలుపోని స్థితిలో మిగిలిపోయింది. అయితే అసలు పాక్ మొత్తం రుణభారం ఎంత అనే ప్రశ్న మదిలో మెదలక మానదు.
అమెరికాలోని కాలేజ్ ఆఫ్ విలియం అండ్ మేరీకి చెందిన రీసెర్చ్ ల్యాబ్ 'ఎయిడ్ డేటా' ఇటీవల ఓ నివేదిక ప్రచురించింది. ఇందులో చైనాకు చెల్లించాల్సిన పాకిస్థాన్ రుణభారాన్ని లెక్కించింది. 2000-2021 మధ్య పాక్ లోని 433 ప్రాజెక్టులకు బీజింగ్ నిధులు సమకూర్చినట్లు పరిశోధకులు తేల్చారు.

పాకిస్థాన్ కు చైనా ఇచ్చిన అప్పు మొత్తం 69 బిలియన్ డాలర్లు అని రీసెర్చ్ తెలిపింది. 2013-2021 మధ్య 55.8, 2015-2017 మధ్య 33 బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చినట్లు వెల్లడించింది. రిపోర్ట్ ప్రకారం.. 2000-2021 మధ్య రష్యా 169, వెనిజులా 113 బిలియన్ డాలర్ల రుణాల తర్వాత ముడో అతిపెద్ద రుణగ్రహీతగా పాక్ నిలిచింది. 2013లో బీజింగ్ రుణ పోర్ట్ ఫోలియోలో ఎమర్జెన్సీ రెస్క్యూ లెండింగ్ కేవలం 5 శాతం కాగా.. 2021 నాటికి ఇది 58 శాతానికి పెరిగింది.
చైనాకు చెందిన వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుంచి కనీసం 102.85 బిలియన్ డాలర్ల విలువైన స్వల్ప మరియు దీర్ఘకాలిక రుణాలను పాకిస్థాన్ పొందినట్లు డేటా చెబుతోంది. ఇవికాక 1958 నుంచి 23 సార్లు, 1988 నుంచి 14 సార్లు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) నుంచి ఇస్లామాబాద్ నిధులను పొందింది. దీన్నిబట్టి చూస్తే పాకిస్థాన్ నిరంతరం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications