అమెరికాలో ఉన్నత చదువు.. భారత్‌లో ఉద్యోగం దొరకక అష్ట కష్టాలు.. చివరకు ఏమైందంటే..
విదేశాలలో ఉన్నత చదువులు పూర్తి చేసి భారతదేశానికి తిరిగి రావడం చాలా మందికి కలల క్షణంగా చెప్పవచ్చు. కుటుంబానికి, సమాజానికి, కెరీర్ పురోగతికి ఇది విజయ సూచికగా భావిస్తుంటారు. కానీ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన ఒక యువకుడికి ఆ కలల ప్రయాణం వాస్తవం అయ్యేలోపు కఠినమైన పోరాటంగా మారిపోయింది. ఈ నిరాశాజనక అనుభవాన్ని అతను ఇటీవల రెడ్డిట్‌లో పంచుకున్నాడు. వేలాది మంది యువతీ యువకులు ఎదుర్కొంటున్న అసలు పరిస్థితిని బయటపెట్టాడు.
అతను మే 2025లో యునైటెడ్ స్టేట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ శోధన కఠినమే అవుతుందని ముందే ఊహించాడు. కానీ ఇంత తీవ్రంగా ఉంటుందని మాత్రం ఊహించలేదు. కొన్ని నెలల పాటు, ఉద్యోగాల కోసం నేరుగా అప్లై చేయడం, రిఫరల్స్, నెట్‌వర్కింగ్, రిక్రూటర్లతో మాట్లాడటం, కోల్డ్ ఈమెయిల్స్ ..ఇలా నేనెంతో కష్టపడ్డా. కానీ ఏదీ పని చేయలేదని అతను రాశాడు. పెద్ద టెక్ కంపెనీలలో ఇంటర్వ్యూ రౌండ్లను క్లియర్ చేసినప్పటికీ.. ఎటువంటి ముందడుగు లేకుండా తిరస్కరణలే వచ్చాయని తెలిపారు.

అతని కష్టాలను OPT (Optional Practical Training) వీసా వ్యవస్థలో ఉన్న కఠినత మరింత పెంచింది. అమెరికాలోని ఉద్యోగ మార్కెట్ భారీ క్షీణతను ఎదుర్కొంటుండటంతో.. అంతర్జాతీయ విద్యార్థులు ఉద్యోగాలను పొందడం మరింత కష్టంగా మారింది. ఇంటర్వ్యూ కాల్స్ ఆగిపోయాయి. ఉద్యోగ ప్రకటనలు కనిపించడం మానేశాయి. రిక్రూటర్లు స్పందించడం కూడా మానేశారు. OPTలో ఉన్న వారికే పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని అతను వివరించాడు. ఉద్యోగం లేకపోతే బ్రతకడం అసాధ్యం కాబట్టి, అతను డేటా అనలిస్ట్‌గా కాంట్రాక్ట్ రోల్ స్వీకరించాడు. ఆ ఉద్యోగం పనిలో బిజీగా ఉంచినా.. అది అతని నైపుణ్యాలకు, కెరీర్ లక్ష్యాలకు సరిపోలలేదు. నా స్కిల్స్ వృథా అవుతున్నాయి. అందరూ పరుగెడుతున్న రేసులో నేను వెనుకబడుతున్నానని అనిపిస్తోందని చెప్పాడు.
భావోద్వేగ ఒత్తిడి, అనిశ్చితి, కెరీర్ మీద పెరుగుతున్న భయాలతో బాధపడుతూ.. చివరకు అతను భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చి కొత్త దృష్టితో, పూర్తి శక్తితో ఉద్యోగ వేటను పునఃప్రారంభించాలని నేను నిర్ణయించుకున్నానని రాశాడు. అమెరికాకు వెళ్లే ముందు అతను భారతదేశంలో కంప్యూటర్ సైన్స్ నేపథ్యంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా రెండు సంవత్సరాలు పనిచేశాడు. ఇప్పుడు భారతదేశంలో లేదా విదేశాలలో ఎక్కడైనా SDE లేదా అనలిస్ట్ పోస్టుల కోసం వెతుకుతున్నాడు. మీలో ఎవరికైనా ఏవైనా మంచి అవకాశాల గురించి తెలుసుంటే, దయచేసి చెప్పండి. అది నాకు చాలా విలువైనదిగా ఉంటుందని వినయపూర్వక విజ్ఞప్తి చేశాడు.
ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి స్పందనలు వెల్లువెత్తాయి. OPTలో ఉన్న వాళ్లు వలసదారులు కాదు, అది F1 స్టూడెంట్ వీసా భాగం మాత్రమే అని ఒకరు స్పష్టం చేశారు. మరొకరు USలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఎంట్రీ లెవల్ జాబ్ మార్కెట్ పడిపోయింది. మీ ఉద్యోగ వేటకు శుభాకాంక్షలు. తిరిగి స్వాగతం! అని రాశారు. మరో నెటిజన్ అనుభవజ్ఞులైన అభ్యర్థులకు కూడా H1B నియామకాలు ఆగిపోయాయి. USలో రిక్రూట్‌మెంట్ క్రమంగా కూలిపోతోందని వివరించాడు. ప్రపంచ మార్కెట్ చల్లబడింది. ఇది కొన్ని సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉందనే హెచ్చరిక కూడా వినిపించింది.
OPT అంటే ఏమిటి? : OPT అన్నది Optional Practical Training యొక్క సంక్షిప్త రూపం. ఇది అమెరికాలో F1 స్టూడెంట్ వీసాతో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు చదువు పూర్తయ్యాక ప్రాక్టికల్ వర్క్ అనుభవం పొందడానికి ఇచ్చే అనుమతి. అమెరికాలో F1 వీసాపై Degree (Bachelor's, Master's, PhD) చేస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఇది లభిస్తుంది. వారు చదివిన Subject / Degree fieldకి సంబంధిత ఉద్యోగంలో పని చేసే అవకాశం కల్పించడానికి 12 నెలలు అవకాశం ఉంటుంది. STEM (Science, Technology, Engineering & Math) ఫీల్డ్ విద్యార్థులు అదనంగా 24 నెలల Extension పొందవచ్చు. వారు మొత్తం వరకు 36 నెలలు పని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికాలో ఖరీదైన డిగ్రీ ఉన్నా.. ఉద్యోగం హామీ కాదని, భారత్‌లో కూడా ఉద్యోగ వేట సవాళ్లతో నిండిన రన్నింగ్ రేస్ అని అతని అనుభవం నిరూపిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications