అమెరికా కల వదిలేసుకోండి.. H-1B వీసా ఉన్న ఉద్యోగం ఉండదు.. రెడ్డిట్‌లో హాట్ డిబేట్ ఇదిగో..
అమెరికా డ్రీమ్ కథ ముగిసిపోయింది. భారతీయుల అమెరికా కల ఇప్పుడు కలగానే మిగిలిపోతోంది. చాలామంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. తాజాగా రెడ్డిట్ లో ఓ యూజర్ ఇదే విషయంపై చేసిన వీడియో వైరల్ అవుతోంది. H-1B వీసా లాటరీలో ఎంపిక కాకపోతే అమెరికాలో జీవితం ఎలా నిలిచిపోతుందో ఒక భారతీయ రెడ్డిటర్ తన అనుభవాల ద్వారా వివరించాడు. 2027 సంవత్సరానికి సంబంధించిన H-1B వీసా రిజిస్ట్రేషన్ మార్చి 4న ప్రారంభం కానుండగా.. తనకు కంపెనీ నుంచి వచ్చిన తాజా సమాచారం తన భవిష్యత్తుపై తీవ్రమైన అనిశ్చితిని మిగిల్చిందని అతను ఆ పోస్టులో పేర్కొన్నాడు.
ఆ రెడ్డిటర్ ప్రకారం.. తాను 2021లో అమెరికాకు వెళ్లాడు. అదృష్టవశాత్తూ ఒక ఇంటర్న్‌షిప్ దక్కించుకున్నాడు. బాగా కష్టపడి పని చేయడంతో చివరికి పూర్తి సమయం ఉద్యోగ ఆఫర్ కూడా సాధించాడు. అయితే పరిశ్రమ అంతటా భారీ స్థాయిలో తొలగింపులు ప్రారంభమైన సమయంలో.. తాను డిసెంబర్‌లో గ్రాడ్యుయేట్ అవబోతున్న వేళ ఆ ఉద్యోగ ఆఫర్ ఒక్కసారిగా రద్దయ్యింది. చదువు పూర్తయ్యేలోపు సమయం చాలా తక్కువగా ఉండటంతో.. అతను మునుపెన్నడూ లేనంతగా శ్రమించి మరో పూర్తి సమయం ఉద్యోగాన్ని సంపాదించగలిగాడు.

H-1B వీసా లాటరీలో అతనికి ఇది మూడో ప్రయత్నం. మూడుసార్లూ ఎంపిక కాలేదు. అమెరికాలో ఉండేందుకు, అదే కంపెనీలో పని కొనసాగించేందుకు, అతను మరో మాస్టర్స్ డిగ్రీ కూడా చేయాల్సి వచ్చింది. ఇది చాలా మంది భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితికి ప్రతిబింబంగా మారింది.
అయితే అసలు షాక్ మాత్రం H-1B లాటరీ రిజిస్ట్రేషన్ ప్రారంభానికి కేవలం నెల రోజుల ముందు వచ్చింది. తన కంపెనీ వివిధ కారణాలను చూపిస్తూ తనకు వీసా స్పాన్సర్ చేయలేమని స్పష్టంగా చెప్పిందని అతను వెల్లడించాడు. అతని విషయంలో కంపెనీకి లక్ష డాలర్లు వంటి భారీ ఫీజులు కూడా లేకపోయినా.. స్పాన్సర్‌షిప్ ఇవ్వలేమని తేల్చి చెప్పడం అతన్ని తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ఈ క్షణమే నాకు ఒక విషయం స్పష్టమైంది. ఒక సంస్థకు మీరు ఎంత విధేయంగా ఉన్నా, అది ఎప్పుడూ స్థిరత్వానికి హామీ ఇవ్వదు. మీరు ఎంత అంకితభావంతో పనిచేసినా, పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారవచ్చని అతను తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
ఇంతకుమించి బాధ కలిగించే విషయం ఏమిటంటే.. కొంతమంది స్నేహితులు వీసా కోసం అమెరికా వాసిని వివాహం చేసుకోవాలని తనకు సూచించారని అతను చెప్పాడు. అయితే ఆ ఆలోచనను తాను పూర్తిగా తిరస్కరిస్తున్నానని, అది చట్టవిరుద్ధం మాత్రమే కాక అనైతికం కూడా అని అతను స్పష్టం చేశాడు.
ఈ పోస్ట్‌పై స్పందించిన ఇతర రెడ్డిటర్లు..అమెరికన్ డ్రీమ్ చనిపోయింది. H-1B అనేది కేవలం అదృష్టంపై ఆధారపడే లాటరీ అని వ్యాఖ్యానించారు. మరికొందరు చెల్లుబాటు అయ్యే H-1B వీసా ఉన్నప్పటికీ అమెరికాను వదిలి కెనడాకు వెళ్లిపోయామని తెలిపారు. USలో H-1B కార్మికులకు కూడా భవిష్యత్తు లేదు అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమైంది.
ఒకరు తన అనుభవాన్ని పంచుకుంటూ.. ఈ సంవత్సరం నా H-1Bని ఫాలో చేయడం లేదని HR నుంచి నాకు మెయిల్ వచ్చింది. నేను కూడా మూడు సార్లు ఎంపిక కాలేదు. చివరికి కెనడాకు వెళ్లిపోయాను. గత 8 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉన్నాను. నా స్నేహితులంతా అక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నానని వ్యాఖ్యానించారు.
ఈ సంఘటనలు అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న వాస్తవాన్ని మరోసారి బయటపెట్టాయి. H-1B వీసా అనిశ్చితి, ఉద్యోగ భద్రత లేకపోవడం, భవిష్యత్తుపై భయం..ఇవన్నీ ఇప్పుడు అమెరికన్ డ్రీమ్‌కు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయని సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications