India-America deal: అమెరికాతో ఇండియా భారీ ఆటోమోటివ్ డీల్.. నగరాలకు భారీ బెనిఫిట్
India-America deal: సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం నుంచి ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత వెహికల్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా అగ్రరాజ్యం అమెరికాతో ఓ భారీ ఒప్పందం చేసుకుంది. ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇదో పెద్ద ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.
మేడ్-ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సులు.. భారతీయ రోడ్లపై త్వరలోనే విరివిగా చక్కర్లు కొట్టనున్నాయి. ఆటోమోటివ్ పరిశ్రమకు ఊతమివ్వడంలో భాగంగా తమతో కలిసి 10 వేల ఇ-బస్సులను తయారుచేయనున్నట్లు US ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. తద్వారా ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు కర్బన ఉద్గారాలు, పలు రకాల కాలుష్యాలకూ చెక్ పెట్టవచ్చని పేర్కొంది.

గతనెలలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఎలక్ట్రిక్ బస్సుల గురించి చర్చ జరిగింది. 'PM-eBus' పేరిట పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(PPP) విధానంలో 10 వేల ఇ-బస్సులను సిటీల్లో తిప్పేందుకు నిర్ణయించారు. ఈ పథకం వ్యయం 57 వేల 613 కోట్లు కాగా.. అందులో 20 వేల కోట్లను కేంద్రం అందించనుంది. 10 ఏళ్లపాటు ఈ సర్వీసులకు మద్ధతు ఇవ్వడానికి సైతం మోదీ సర్కారు అంగీకరించింది.
3 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాల్లోని రాజధాని నగరాలను ఈ పథకం కవర్ చేస్తుంది. ఇందులో వ్యవస్థీకృత బస్సు సేవలు లేని నగరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక దీనిద్వారా సుమారు 55 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.


Click it and Unblock the Notifications