చైనాని సైలెంట్‌గా లేపేయాలని చూస్తున్న అమెరికా.. ఈ సారి ట్రంప్ సరికొత్త ప్లాన్ ఏంటంటే..
అమెరికా-చైనా మధ్య సాంకేతిక ఉద్రిక్తతలు మరలా పెరుగుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అరుదైన భూమి ఖనిజాల ఎగుమతులపై బీజింగ్ ఇటీవల విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు వ్యతిరేకంగా మరో రీ ఎగుమతి నియంత్రణ ప్రణాళికను పరిశీలిస్తున్నారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ చర్య అమల్లోకి వస్తే, ప్రపంచ టెక్ సరఫరా గొలుసుపై దాని ప్రభావం విపరీతంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాషింగ్టన్‌లోని అనధికార వర్గాల ప్రకారం.. ఈ ప్రతిపాదిత చర్య సాఫ్ట్‌వేర్ ఆధారిత ఉత్పత్తులపై విస్తృత ఎగుమతి నియంత్రణలు విధించడానికి ఉద్దేశించబడి ఉంది. అంటే, అమెరికా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి తయారైన లేదా అమెరికన్ సాంకేతికతపై ఆధారపడ్డ ల్యాప్‌టాప్‌లు, సెమీకండక్టర్లు, జెట్ ఇంజిన్‌లు వంటి వస్తువులు చైనాకు ఎగుమతి చేయడాన్ని పరిమితం చేస్తుంది.దాదాపు ప్రతి ఆధునిక ఉత్పత్తి అమెరికన్ సాఫ్ట్‌వేర్‌తో తయారవుతుంది. ఈ నియంత్రణలు అమల్లోకి వస్తే, ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ఉత్పత్తుల సరఫరా పద్ధతిని పూర్తిగా మార్చేస్తాయని పేర్కొన్నారు.

మరి ఈ చర్య అమలవుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ.. అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా పరిశీలిస్తోందని నివేదికలు వెలువడుతున్నాయి. ఇది China టెక్ సామర్థ్యాలను నియంత్రించడంలో అమెరికా తీసుకుంటున్న తదుపరి ఘట్టంగా భావించబడుతోంది.
నవంబర్ 1 నుండి చైనా దిగుమతులపై 100% సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా ఏదైనా కీలకమైన సాఫ్ట్‌వేర్ ఎగుమతులను పరిమితం చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ ఎగుమతి నియంత్రణ ప్రతిపాదన ఆ ప్రకటనకు అనుగుణంగా రూపొందిన మొదటి నిజమైన వ్యూహాత్మక చర్యగా పరిగణించబడుతోంది.
ఇందులో ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ట్రంప్ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చిన సమయమేనని చెప్పవచ్చు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో దక్షిణ కొరియాలో ట్రంప్ కలుసుకోబోతున్నారు. దీనికి కొన్ని వారాల వ్యవధి సమయం ఉంది. అంటే ఇది కేవలం ఆర్థిక ప్రతీకారం కాదు.. స్వదేశీయ ఒత్తిడి సాధనంగా కూడా పరిగణించబడుతుంది.
బీజింగ్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. చైనా రాయబారి కార్యాలయం ప్రతినిధి దీనిపై వ్యాఖ్యానిస్తూ.. మేము ఏకపక్ష 'లాంగ్ ఆర్మ్ జ్యూరిస్డిక్షన్' చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అమెరికా ఈ చర్యను ముందుకు తీసుకెళ్తే మేము కఠినమైన ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చైనా ఇప్పటికే అరుదైన భూమి మూలకాల ఎగుమతులను పరిమితం చేసింది. ఇవి చిప్ తయారీకి కీలకమైన పదార్థాలు. దానికి ప్రతీకారంగా అమెరికా ఈ సాఫ్ట్‌వేర్ ఎగుమతి నియంత్రణలను తీసుకురావడం, రెండు దేశాల మధ్య టెక్ యుద్ధాన్ని మరింత ముదిరే దిశగా తీసుకువెళుతోందని చెప్పవచ్చు.
ఈ కొత్త ఎగుమతి నియంత్రణలు అమల్లోకి వస్తే, అవి బైడెన్ కాలంలో రష్యాపై అమలుచేసిన టెక్ ఎగుమతి నిషేధాలను గుర్తు చేస్తాయి.ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని పునర్నిర్మించడమే కాకుండా,చైనా తయారీదారులు, అమెరికన్ సరఫరాదారులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications