Ambani News: కొత్త వ్యాపారంలోకి అంబానీ డాటర్.. వేట మెుదలెట్టిన రిలయన్స్ గ్రూప్
Reliance Retail: దేశంలో అత్యంత సంపన్న వ్యాపార సంస్థల్లో ఒకటి రిలయన్స్ గ్రూప్. అంబానీ నేతృత్వంలో కంపెనీ అనేక కొత్త వ్యాపారాల్లోకి గత కొన్నేళ్లుగా ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంబానీ వారసులు పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ దూకుడు మరింత వేగవంతం అయ్యింది.
ముఖ్యంగా ఇషా అంబానీ చేతిలో పడిన తర్వాత రిలయన్స్ రిటైల్ వ్యాపారం ఊహించని ఎదుగుదలను చూస్తోంది. ఈక్రమంలోనే రిలయన్స్ గ్రూప్ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ 150 బిలియన్ డాలర్ల డయాగ్నస్టిక్ హెల్త్ కేర్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతోందని వెల్లడైంది. ఈ రంగంలో రూ.1,000 నుంచి రూ.3,000 కోట్లను పెట్టుబడిగా పెట్టడం ద్వారా ఈ వ్యాపారంలో ఉన్న ఏదైనా కంపెనీని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తోంది.

కొత్త కంపెనీని ఏర్పాటు చేయటం కంటే డెడికేటెడ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ సంస్థలో మెజారిటీ వాటాను కొనుగోలు ఉత్తమమని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం ముఖేష్ అంబానీకి చెందిన సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉనికిని కలిగి ఉన్న ప్లేయర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలయన్స్ గ్రూప్ ఆన్‌లైన్ ఫార్మసీ నెట్‌మెడ్స్‌ను కలిగి ఉంది. ఇది థైరోకేర్, హెల్తీయన్స్ వంటి ఇతర సంస్థలతో టై-అప్‌ల ద్వారా పాథాలజీ సేవలను అందిస్తుంది.
నెట్‌మెడ్స్ ఇప్పటికే ఇతర సంస్థల సహకారంతో పాథాలజీ సేవలను అందజేస్తుండగా.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ భారతదేశం అంతటా ఫిజికల్ లాబొరేటరీల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి, విస్తృత శ్రేణి రోగనిర్ధారణ సేవలను అందించడానికి, స్కేలబిలిటీని పెంచడానికి సొంతంగా డయాగ్నస్టిక్ కంపెనీని స్థాపించాలని భావిస్తోంది. దీనికి ముందు 2020లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను రూ.620 కోట్లకు కొనుగోలు చేసింది.
డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగం వృద్ధికి సిద్ధంగా ఉండటంతో దేశంలోని పెద్ద ఆటగాళ్లు ఈ రంగంపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు. రేటింగ్ ఏజెన్సీ CRISIL ఏప్రిల్‌లో విడుదలచేసిన నివేదిక ప్రకారం డయాగ్నోస్టిక్ కంపెనీలు 2025 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో 10-11 శాతం వృద్ధిని నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అంచనా వేసింది. ప్రధానంగా టైక్-2,3 నగరాల్లో సమగ్ర నివారణ ఆరోగ్య ప్యాకేజీల కోసం పెరుగుతున్న డిమాండ్ ఇందుకు కారణంగా కంపెనీ పేర్కొంది. దేశంలో కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్యంపై ప్రజలు మళ్లీ దృష్టి సారించడమే నివారణ ఆరోగ్య పరీక్షల పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications