Reliance: ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో అత్యంత విలువైన కంపెనీగా దూసుకుపోతోంది. గత మూడేళ్ల నుంచి జీతం కూడా తీసుకోకుండా ఆయన సంస్థకు సారథ్యం వహిస్తున్నారు. కాగా తమ కుటుంబీకుల జీతభత్యాలపై మరో కీలక ప్రకటన చేశారు.
గతనెల 28న జరిగిన 46వ AGMలో ముఖేష్ అంబానీ తన వారసుల గురించి ఓ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలను రిలయన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా కంపెనీ కోసం తరువాతి తరం నాయకులను తీర్చి దిద్దడం, సాధికారత కల్పించడం లక్ష్యమన్నారు.

అయితే అంబానీ ముగ్గురు సంతానం బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రుసుములు మాత్రమే చెల్లించే విధంగా.. వారి నియామకానికి వాటాదారుల అనుమతిని కోరుతూ కంపెనీ తీర్మానం ప్రవేశపెట్టింది. అంబానీ భార్య నీతా కంపెనీ బోర్డులో గతంలో నియమితులు కాగా.. 2022-23లో 6 లక్షల సిట్టింగ్ ఫీజు, 2 కోట్ల కమీషన్ పొందారు. ఇప్పుడు వీరి నియామకం కూడా ఇదే తరహాలో జరగనుంది.
2020-21 నుంచి ముఖేష్ అంబానీ జీతం తీసుకోకుండానే పని చేస్తున్నారు. కాగా ఆయన బంధువులు నిఖిల్, హితల్ సహా ఇతర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు జీతభత్యాలతో పాటు అలవెన్సులు, కమీషన్లు సైతం సంస్థ చెల్లిస్తోంది. కానీ ఇప్పుడు తన సంతానానికి జీతం నుంచి మినహాయింపు ఇస్తూ.. కేవలం సిట్టింగ్ ఫీజు, సంస్థ లాభాలపై కమీషన్ మాత్రమే చెల్లించేలా ఏర్పాటు జరుగుతోంది.


Click it and Unblock the Notifications