Reliance Retail: ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. అంబానీ అనగానే సహజంగా అందరికీ గుర్తుకువచ్చేది ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారం. అయితే టెలికాం రంగంలో జియో విప్లవం తర్వాత అంబానీ ఫ్యామిలీ గురించి దేశంలో మారుమూల ప్రాంతంలోని ప్రజలు సైతం తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం కుమార్తె ఇషాకు పగ్గాలు అప్పగించిన తర్వాత రిటైల్ వ్యాపారం సైతం అంబానీకి కాసులు కురిపిస్తోంది.
రిలయన్స్ గ్రూప్ కింద రిటైల్ వ్యాపారాన్ని ఇషా అంబానీ నేతృత్వంలో రిలయన్స్ రిటైల్ పేరిట కొనసాగుతోంది. ఇటీవల కంపెనీ విడుదల చేసిన మార్చి త్రైమాసిక ఫలితాల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ అమ్మకాల విలువ ఏకంగా రూ.3 లక్షల కోట్లను తాకింది. దీంతో కంపెనీ దేశీయ మార్కెట్లోని కన్జూమర్ ఉత్పత్తుల విక్రయంలో పెద్ద ఆటగాళ్లైన ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, డీమార్ట్, నెస్లే, బ్రిటానియా, టాటా కన్జూమర్, గోద్రేజ్ కన్జూమర్ వంటి కంపెనీలను అధిగమించి పెద్ద రికార్డును సొంతం చేసుకుంది.

లిస్టెడ్ రిటైల్ కంపెనీలను పరిశీలిస్తే డిసెంబరు 2023తో ముగిసిన తొమ్మిది నెలలకు రూ.56,983 కోట్ల అమ్మకాలతో డీమార్ట్ కంటే 5 రెట్లు ఎక్కువ సేల్స్ నిర్వహించింది. రిలయన్స్ రిటైల్ విలువ 110 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఇప్పటికే అనేక బ్రోకరేజ్ సంస్థలు తమ అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విలువ ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్ కంటే పెద్దదిగా కంపెనీని మార్చేసింది. ప్రస్తుతం ఐటీసీ మార్కెట్ క్యాప్ విలువ 66 బిలియన్ డాలర్లుగా ఉండగా.. హిందుస్థాన్ యూనీలివర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 62 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడైంది.
రిలయన్స్ గ్రూప్ మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రిలయన్స్ రిటైల్ విలువను 108 బిలియన్ డాలర్లుగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. రిటైల్ వ్యాపారంలో కంపెనీ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రంగాల్లో తన విస్తరణను వేగంగా కొనసాగిస్తోందని బ్రోకరేజ్ వెల్లడించింది. అలాగే కంపెనీ మార్జిన్‌లలో స్థిరమైన మెరుగుదల, ప్రైవేట్ లేబుల్‌ల వాటా క్రమంగా పెరుగుతూ ఉండటంతో రానున్న 2-3 ఏళ్లలో ఈ విభాగం బలమైన వృద్ధిని కొనసాగిస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లోని విశ్లేషకులు అంచనా వేశారు.
బ్రోకరేజీల అంచనా ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ షేరులో రిలయన్స్ రిటైల్ విలువ ఒక్కో షేరుకు రూ.1,593కి వస్తుంది. ఇదే క్రమంలో కంపెనీ తన చిన్న ఫార్మాట్ జియో స్టోర్లతో పాటు 1 మిలియన్లకు పైగా రిటైల్ భాగస్వాముల ద్వారా జియో సేవలకు మాస్టర్ డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగటం కూడా కంపెనీ భవిష్యత్తులో పెరుగుదలను నమోదు చేస్తుందని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. దీనికి ముందు గ్లోబల్ బోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ లెక్కల ప్రకారం రిలయన్స్ రిటైల్ ఎంటర్ ప్రైజె విలువ 112 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.


Click it and Unblock the Notifications