Hurun India: ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. వివిధ విభాగాల్లో తన హవా చాటుతోంది. దేశంలో అత్యంత విలువైన కంపెనీగా RIL కొనసాగుతుండగా.. అపర కుబేరుడిగా దాని అధినేత మరోసారి సత్తా చాటారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
హురున్ ఇండియా మరియు 360 వన్ వెల్త్ సంయుక్తంగా రిచ్ లిస్ట్ 2023 నివేదిక విడుదల చేశాయి. 2023కి గాను 8 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఆస్తులతో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. అయితే హిండెన్‌బర్గ్ ఆరోపణల కారణంగా గౌతమ్ అదానీ సంపదలో భారీ క్షీణత ఏర్పడింది. అంబానీల సంపద గతేడాదితో పోలిస్తే 2 శాతం పెరగ్గా.. ఇదే సమయంలో అదానీ సంపద విలువ 57 శాతం తగ్గి 4.74 లక్షల కోట్లకు పడిపోయింది.

ఇక టాప్ 10లోని సంపన్నుల జాబితా చూస్తే.. సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రమోటర్ పూనావాలా ఫ్యామిలీ ఆస్తుల నికర విలువ 2.78 లక్షల కోట్లు, HCL శివ నాడార్ 2.28, గోపీచంద్ హిందూజా కుటుంబం 1.75, సన్ ఫార్మా దిలీప్ శాంఘ్వీ 1.64, ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 1.62, D-Mart రాధాకిషన్ దమానీ 1.43, KM బిర్లా సంపద 1.25, నీరజ్ బజాజ్ ఫ్యామిలీ 1.20 లక్షల కోట్లతో తదనంతర స్థానాల్లో కొనసాగుతున్నారు.
గత 5 ఏళ్లలో దేశంలోని అత్యంత ధనవంతుల సంపద 76 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తద్వారా ఈ ఏడాది బిలియనీర్ల సంఖ్య 259కి చేరినట్లు చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 38 మంది ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు ఇండియాలో 1,319 మందికి వెయ్యి కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నాయి.


Click it and Unblock the Notifications