అమెజాన్ గ్లోబల్ బిజినెస్ ప్రాఫిట్ అదుర్స్: ఎన్నో చిన్నదేశాల బడ్జెట్ కంటే ఎక్కువ..
అమెజాన్ ఇంటర్నేషనల్ బిజినెస్(అమెరికా బయట) డిసెంబర్ క్వార్టర్‌లో 363 మిలియన్ డాలర్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 617 మిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా భారీ లాభాలు రికార్డయ్యాయి. ఓవర్సీస్ సేల్స్ 54 శాతం పెరిగి 37 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది అమెజాన్ ఆదాయంలో 30 శాతంగా ఉండటం గమనార్హం. అంటే డిసెంబర్ త్రైమాసికంలో ఇది 125 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికాలోను హాలీడే సేల్స్ అదరగొట్టాయి. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ షాపింగ్ పెరిగింది.

అమెరికా బయట.. అమెజాన్ రికార్డ్ లాభం
భారత్‌లో అమెజాన్ క్రమంగా తమ పెట్టుబడులు పెంచుతోంది. అమెరికా బయట.. భారత్‌లోనే అతిపెద్ద మార్కెట్ కలిగి ఉంది. భారత్‌లో ఈ-కామర్స్ వ్యాపారాన్ని మరింత పెంచే లక్ష్యంలో భాగంగా మార్చి 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వివిధ యూనిట్లలోకి 1.5 బిలియన్ డాలర్ల మేర జొప్పించింది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఆదాయం కరోనా సమయంలో భారీగా పెరిగిన విషయం తెలిసిందే. జెఫ్ బెజోస్ సంపద 190 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది.
అమెజాన్ నికర అమ్మకాలు 2020లో 38610 కోట్ల డాలర్ల (రూ.28.95 లక్షల కోట్లు)కు చేరాయి. ఇది మన దేశ బడ్జెట్‌కు దాదాపు దగ్గర. ఎన్నో చిన్న దేశాల బడ్జెట్లు అన్ని కలిసినా అమెజాన్ అమ్మకాలే ఎక్కువ. అమెజాన్ వ్యాల్యూ ఇప్పుడు 1.7 లక్షలకోట్ల డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో రూ.127.5 లక్షల కోట్లు.

బాధ్యతల నుండి తప్పుకుంటున్న జెఫ్ బెజోస్
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ కంపెనీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నారు. 2021 మూడో త్రైమాసికం నాటికి అమెజాన్‌లో తన బాధ్యతల నుంచి ఆయన వైదొలగనున్నారు. తన వారసుడిని ఖరారు చేసిన బెజోస్, ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తదుపరి సీఈవోగా ఆండీ జాస్సీని నియమించారు. ఆండీ జస్సీ అమెజాన్‌లో 1997లో చేరారు. ఎంబీఐలో అంతకుముందు ప్రాజెక్టు మేనేజర్‌గా కెరీర్ ప్రారంభమైంది. హార్వార్డ్ బిజినెస్ స్కూల్‍లో ఎంబీఏ చదివారు. ఇరవై ఏళ్ల క్రితం బెజోస్ వద్ద టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరారు. అమెజాన్ వెబ్ సిరీస్‌ను ప్రారంభించింది జాస్సీయే. అతని వయస్సు 53 ఏళ్లు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో
మూడు దశాబ్దాల క్రితం ఆన్‌లైన్‌లో పుస్తకాలతో ప్రారంభించి, ఇపుడు ప్రతి వస్తువు విక్రయించేస్థాయికి ఎదిగింది. అమెజాన్‌ని ఈ-కామర్స్‌లో అంతర్జాతీయ నెంబర్ వన్ కంపెనీగా తీర్చిదిద్దిన వ్యక్తి జెఫ్ బెజోస్. తక్కువ కాలంలో ప్రపంచ కుబేరుల జాబితాలోకి చేరారు. జెఫ్ బెజోస్ కంపెనీ బాధ్యతల నుండి తప్పుకున్నప్పటికీ, కంపెనీని మాత్రం వీడడంలేదు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో కొనసాగుతారు.


Click it and Unblock the Notifications