అమెజాన్ స్టాక్స్ అదుర్స్, జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డ్: బిల్‌గేట్స్ కంటే ఎంత ఎక్కువ అంటే?
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఇతను 200 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా రికార్డ్ సాధించారు. భారత కరెన్సీ ప్రకారం ఆయన సంపద దాదాపు రూ.15 లక్షల కోట్లు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం సంపద 204 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ షేర్లు భారీగా రాణించడంతో పెరిగింది. జనవరి నుండి బెజోస్ సంపద 87 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. గత మూడు నెలల్లో అమెజాన్ షేర్లు 25 శాతం, ఏడాదిలో 86శాతం పెరిగాయి.

బిల్ గేట్స్ కంటే 90 బిలియన్ డాలర్లు అధికం
అమెజాన్ స్టాక్స్ బుధవారం 2 శాతం లాభాల్లో ముగిశాయి. దీంతో జెఫ్ బెజోస్ నెట్ ఆదాయం 4.9 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. దీంతో 56 ఏళ్ల బెజోస్ 200 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా నిలిచారు. ప్రపంచ రెండో సంపన్నుడు బిల్ గేట్స్ సంపద కంటే బెజోస్ ఆదాయం దాదాపు 90 బిలియన్ డాలర్లు ఎక్కువ. బిల్ గేట్స్ నెట్ వర్త్ 116.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంపద 100 బిలియన్ డాలర్లు దాటింది. బిల్ గేట్స్, బెజోస్ తర్వాత ఈ రికార్డ్ సాధించిన మూడో వ్యక్తి జుకర్ బర్గ్. టెస్లా షేర్లు కూడా బుధవారం దూసుకెళ్లడంతో ఎలాన్ మస్క్ సంపద 101 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

అమెజాన్ స్టాక్స్ జూమ్
కరోనా మహమ్మారి కారణంగా ఆన్ లైన్ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుండి ఈ-కామర్స్ వెబ్ సైట్లకు గిరాకి పెరిగింది. దీంతో దిగ్గజ కంపెనీ అమెజాన్ షేర్లు భారీగా లాభపడ్డాయి. అమెజాన్ స్టాక్స్ ఈ ఏడాది ప్రారంభం నుండి దాదాపు 80 శాతం ఎగిశాయి. దీంతో జనవరి 1వ తేదీన 115 బిలియన్ డాలర్లుగా ఉన్న జెఫ్ బెజోస్ సంపద ఇప్పుడు 200 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెజాన్‌లో బెజోస్ వాటా 11 శాతంగా ఉంది. అతని సంపదలో ఇది 90 శాతం కంటే ఎక్కువ. వాషింగ్టన్ పోస్ట్, ఏరో స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ వంటి ప్రయివేటు పెట్టుబడులు ఉన్నాయి.

ఖరీదైన విడాకులు
గత ఏడాది భార్య మెకంజీకి పెద్ద ఎత్తున భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నారు జెఫ్ బెజోస్. చరిత్రలో ఇది అత్యత ఖరీదైన విడాకుల పరిష్కారంగా నిలిచింది. భార్యకు భారీగా ఇచ్చినప్పటికీ ప్రపంచ ధనికుడిగానే నిలిచారు బెజోస్. మెకంజీతో విడిపోయినప్పుడు అమెజాన్‌లో తన వాటాలో 25 శాతం ఇచ్చేందుకు అంగీకరించారు. దీని నెట్ వర్త్ 63 బిలియన్ డాలర్లు. అలాగే 1.7 బిలియన్ డాలర్ల మేర చారిటబుల్ గిఫ్ట్స్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications