Amazon News: ఆమ్నెస్టీ దెబ్బకు దిగొచ్చిన ఇ-కామర్స్ దిగ్గజం.. కార్మికులకు అమెజాన్ భారీ పరిహారం..
Gulf News: సొంత ఊళ్లో సరైన ఉద్యోగం దొరక్క పొట్ట చేతపట్టుకుని నగరాలకు, కుదిరితే ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వారి జీవన పరిస్థితులు దుర్భరంగా మారిన సందర్భాలూ లేకపోలేదు. దాదాపు ఇటువంటి సంఘటనే సౌదీ అరేబియాలో జరిగింది. అమెజాన్ చట్టవిరుద్ధంగా చేసిన పనికి ఇప్పుడు మూల్యం చెల్లించింది.
గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో కార్మికులపై ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అనేక రకాల అధికార దుర్వినియోగాలకు పాల్పడిందని అక్టోబరులో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఆరోపించింది. ఈ వ్యవహారంలో 700 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికుల నుంచి చట్టవిరుద్ధంగా కలెక్ట్ చేసిన రిక్రూట్‌మెంట్ ఫీజులను రీయింబర్స్ చేసింది. మొత్తం 1.9 మిలియన్ డాలర్లను ఇందుకోసం చెల్లించినట్లు తెలిపింది.

'సౌదీ రిక్రూట్‌మెంట్ ఏజెంట్లు, లేబర్ సప్లై కంపెనీలకు కాంట్రాక్ట్ కార్మికులు రిక్రూట్‌మెంట్ ఫీజులు సహా ఇతర ఖర్చులు చెల్లించినట్లు మేము గుర్తించాం. ఇదేకాక నాణ్యత లేని వసతి, కాంట్రాక్ట్ మరియు వేతన అక్రమాలతో పాటు కార్మికుల ఫిర్యాదుల పరిష్కారంలోనూ తీవ్ర జాప్యం చేస్తూ కంపెనీ నియమాలను ఉల్లంఘించినట్లు దర్యాప్తులో వెల్లడైంది' అని అమెజాన్ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
2021 వరకు రియాద్ లేదా జెడ్డాలోని గిడ్డంగులలో పనిచేసిన 22 మంది నేపాలీల ఖాతాలను ప్రామాణికంగా తీసుకుని ఆమ్నెస్టీ నివేదిక రూపొందించింది. వారు భయంకరమైన జీవన పరిస్థితులు, ఉద్యోగ భద్రత ప్రమాదాలతో పాటు వేతన దొంగతనానికి గురవుతున్నారని కనుగొంది. ఇందుకుగాను తాజాగా 700 మంది కాంట్రాక్ట్ కార్మికులకు అమెజాన్ 1.9 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించినట్లు ఇ-కామర్స్ దిగ్గజం ప్రకటించింది.


Click it and Unblock the Notifications