అమెజాన్‌లో ఆగని ఉద్యోగాల కోత..మళ్లీ 700 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..
టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోసారి తన సంస్థ పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యయ నియంత్రణ చర్యల భాగంగా సంస్థ దాదాపు 30 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా న్యూయార్క్ నగరంలోని తొమ్మిది కార్యాలయాలలో సుమారు 700 మంది ఉద్యోగులు ఇప్పటికే ఈ చర్యల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.
న్యూయార్క్ రాష్ట్రంలోని వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ప్రకారం, ఈ ఉద్యోగాల తొలగింపులు నవంబర్ 8, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. WARN డాష్‌బోర్డ్ ప్రకారం, ఈ తొలగింపులు 7వ అవెన్యూ, 10వ అవెన్యూ, 34వ వీధిలోని అమెజాన్ కార్యాలయాలు సహా అనేక మాన్‌హాటన్ ప్రాంతాలను ప్రభావితం చేశాయి.

సియాటిల్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన అమెజాన్ తన కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లో 9 శాతం మందిని తగ్గించే ప్రణాళికలో ఉంది. ఇది సంస్థ చరిత్రలో మహమ్మారి తర్వాత వచ్చిన అతిపెద్ద ఉద్యోగాల కోతగా పరిగణించబడుతోంది. ఈ నిర్ణయం కంపెనీ యొక్క విస్తృత వ్యూహాత్మక మార్పుల భాగమని తెలుస్తోంది. అమెజాన్ పీపుల్ ఎక్స్‌పీరియన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెట్టి ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంటూ, ఈ చర్య ద్వారా మేము సంస్థలోని అవరోధాలను తొలగించి, అధిక స్థాయి పొరలను తగ్గించి, ముఖ్యమైన వ్యాపార విభాగాలపై దృష్టి సారించేందుకు వనరులను మళ్లిస్తున్నామని వివరించారు.
ఆమె ప్రకారం, ఈ మార్పులు సంస్థ యొక్క బిగ్ బెట్స్ అంటే AI, క్లౌడ్, ఈ-కామర్స్ భవిష్యత్తు అభివృద్ధికి మద్దతుగా ఉంటాయి.ఇటీవల త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా CEO ఆండీ జాస్సీ ఈ లేఆఫ్స్ వెనుక ఉన్న ఉద్దేశ్యంపై వచ్చిన ఊహాగానాలను ఖండించారు. ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం ఖర్చులను తగ్గించడానికో లేక కృత్రిమ మేధస్సు (AI) విస్తరణకో కాదు. ఇది ప్రధానంగా సంస్కృతికి సంబంధించిన పునర్వ్యవస్థీకరణ చర్య అని తెలిపారు. జాస్సీ ప్రకారం, అమెజాన్ తన అంతర్గత బృందాల సామర్థ్యాన్ని పెంచడానికి, దీర్ఘకాల దృష్టిలో ఉన్న వ్యాపార లక్ష్యాలను బలోపేతం చేయడానికి ఈ చర్యలు చేపడుతోంది.
న్యూయార్క్‌లోని అమెజాన్ కార్యాలయాల్లో ఉద్యోగాల కోతల వార్తతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. చాలామంది ఉద్యోగులు ఇటువంటి విస్తృత తొలగింపులు మాకు ఊహించని షాక్ అని పేర్కొన్నారు. టెక్ పరిశ్రమలో కూడా ఈ పరిణామం చర్చనీయాంశమైంది. ఎందుకంటే గత కొద్ది నెలల్లో మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర సంస్థలు కూడా ఉద్యోగాల కోతలు చేపట్టాయి.రాయిటర్స్ నివేదిక ప్రకారం, అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో ప్రాధాన్య విభాగాలకు అధిక వనరులు కేటాయించడం, తక్కువ లాభదాయకమైన విభాగాల్లో ఉద్యోగాలను తగ్గించడం వంటి చర్యలు ఉన్నాయి. అమెజాన్ ఈ చర్యల ద్వారా భవిష్యత్తు టెక్నాలజీలపై మరింత దృష్టి సారించాలని చూస్తోంది. కానీ, దాని మూల్యం వేలు సంఖ్యలో ఉద్యోగుల జీవనోపాధి రూపంలో చెల్లించబడుతోంది.


Click it and Unblock the Notifications