Layoffs: ఆర్థిక అనిశ్చితి, జాబ్ మార్కెట్ మందగమనం, AI వినియోగం వెరసి ఉద్యోగాలకు గ్యారంటీ లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారీగా లేఆఫ్స్ ఇచ్చిన అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు.. ఇంకొంత మంది సిబ్బందిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనిని బట్టి రిక్రూట్ మెంట్ ఇండస్ట్రీ ప్రస్తుతం స్థితిని అర్థం చేసుకోవచ్చు.
అమెజాన్ తాజాగా మరో రౌండ్ లేఆఫ్స్ ప్రకటించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. కంపెనీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా అమెజాన్ ఫ్రెష్ స్టోర్లలో కొంత మంది సిబ్బందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. USలోని ఈ దుకాణాల్లో.. ఆయా డిపార్ట్ మెంట్స్ పనితీరును పర్యవేక్షించే, కొత్త ఉద్యోగుల శిక్షణకు బాధ్యత వహించే దిగువ స్థాయి 'జోన్ లీడ్' పొజిషన్ ను పూర్తిగా తొలగించింది.

'ఇతర స్టోర్ల మాదిరిగానే మా అవసరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తాము. సిబ్బంది సామర్థ్యాన్ని సవరించుకుంటూ, కస్టమర్స్ కు మెరుగైన సేవలు అందించేందుకు తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటాము. ఇప్పుడు మా ఇన్-స్టోర్ సిబ్బంది రోజువారీ కార్యకలాపాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నాము' అని అమెజాన్ ప్రతినిధి జెస్సికా మార్టిన్ తెలిపారు.
ది వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. USలోని 8 రాష్ట్రాల ఫ్రెష్ స్టోర్‌లలో మొత్తం 44 ఉద్యోగాల కోత విధించింది. బాధిత ఉద్యోగులు కంపెనీలోని ఇతర పొజిషన్స్ కు అప్లై చేసుకోవచ్చు. సంస్థ నుంచి ఎపార్టింగ్ పేమెంట్ వారికి లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని ఫ్రెష్, గో స్టోర్లను సైతం మూసివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే ఈ లేఆఫ్స్ ఇండియా వరకు వచ్చే అవకాశం లేకపోలేదు.
గత ఏడాదిగా 27 వేల ఉద్యోగుల కోతతో అమెజాన్ చరిత్ర సృష్టించింది. 2023 ప్రారంభంలో 18 వేలు, తర్వాత 9 వేల మంది సిబ్బందిని తొలగించింది. మేలో ఇండియాలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 500 మందికి ఉద్వాసన పలికింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, HR, సపోర్ట్ ఫంక్షన్స్ లోని ఉద్యోగులు ఈ లేఆఫ్స్ వల్ల ప్రభావితమయ్యారు. ఇటీవల ఫార్మసీ విభాగంలో కొందరిని సాగనంపగా, ఇప్పుడు ఫ్రెష్ స్టోర్స్ వంతు వచ్చింది.


Click it and Unblock the Notifications