ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తితో కలిసి అమెజాన్ సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసిన వివాదాస్పద జాయింట్ వెంచర్ సంస్థ రద్దయింది. ప్రియోన్ బిజినెస్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో స్థాపించిన ఈ జాయింట్ వెంచర్ 2022 మిడిల్ నుండి పని చేయడం నిలిచిపోతుందని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కాటమారన్ వెంచర్స్, అమెజాన్ సంస్థలు ఉమ్మడిగా ప్రకటించాయి. భారతదేశంలో ఆన్‌లైన్ మార్కెట్ వ్యాల్యూ ఒక ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు అంచనా వేసిన సమయంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఈ నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బే.

జాయింట్ వెంచర్
జాయింట్ వెంచర్(JV) కాలపరిమితి ముగియకుండా దీనిని కొనసాగించకూడదని పరస్పరం నిర్ణయించుకున్నట్లు ఈ కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ జాయింట్ వెంచర్ ద్వారా వ్యాపారులు ఆన్‌లైన్ మార్గంలో ఉత్పత్తులను విక్రయిస్తాయి. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన బెహెమెత్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన కాటమారన్ వెంచర్స్ సంస్థలు ఈ కంపెనీని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఈ జాయింట్ వెంచర్‌లో 3 లక్షలమంది విక్రేతలు, వ్యవస్థాపకులకు ఆన్‌లైన్ అమ్మకానికి అనుమతి లభించింది. డిజిటల్ చెల్లింపు సామర్థ్యాలున్న నాలుగు మిలియన్ల మంది వ్యాపారులకు అవకాశం ఉంది.

ఏడేళ్ల జాయింట్ వెంచర్
ఈ రెండు సంస్థలు కలిసి నెలకొల్పిన ఈ ప్రియోన్ బిజినెస్ సర్వీస్ ప్రయివేట్ జేవీ ఏడేళ్ల జాయింట్ వెంచర్. ఇప్పుడు వచ్చే సంవత్సరం నుండి కార్యకలాపాలు ముగిసిపోతున్నాయి. అన్యాయమైన, చట్టవిరుద్ధమైన వ్యాపార పద్ధతులు అవలంభిస్తోందని ఇటీవల అమెజాన్ పైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
అమెజాన్‌తో పాటు వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ప్రత్యేక టై-అప్స్ ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తూ గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నాయని, కొంతమంది విక్రేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాఫ్తును కూడా ప్రారంభించింది. ఈ దర్యాఫ్తును నిలిపివేయాలని అమెజాన్, ప్లిప్ కార్ట్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడ తిరస్కరణకు గురయ్యాయి.

ఆరోపణలతో ఒత్తిడి
భారత ఈ-కామర్స్ చట్టాల స్ఫూర్తిని ఉల్లంఘిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో అమెజాన్-కాటమారన్ జేవీకి ముగింపు పలకాలని ఒత్తిడి పెరిగింది. ఈ-కామర్స్ చట్టాల ఉల్లంఘనల వల్ల తలెత్తిన విమర్శలు కూడా వారి మధ్య భాగస్వామ్యం ముగియడానికి దోహదపడ్డాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు విచారణ, పారదర్శకత విషయంలో స్వచ్చంధంగా పని చేస్తాయని తాము ఆసిస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications