WFO: వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌పై అమెజాన్ ఉద్యోగి ఫైర్.. 1.7 కోట్లతో పాటు జాబ్ వదులుకోవడానికీ రెడీ!
WFO: కరోనా విజృంభణ సమయంలో ఉద్యోగులకు కల్పించిన కొన్ని సదుపాయాలను ఆయా కంపెనీలు రద్దు చేస్తున్నాయి. వాటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రధానమైనది. దిగ్గజ కంపెనీలు కూడా సిబ్బందిని ఇప్పుడు ఆఫీసులకు రప్పించడానికి నానా ఇబ్బందులు పడుతున్నాయి. గట్టిగా మాట్లాడితే ఉద్యోగులు కూడా పనిచేసే సంస్థలతో తాడోపేడో తేల్చుకోవడానికి సైతం వెనకాడటం లేదు.
ప్రముఖ ఇ-కామర్స్ రిటైల్ దిగ్గజం అమెజాన్ లో నాలుగేళ్లపాటు రిమోట్ గా పనిచేసిన ఓ ఉద్యోగి.. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కంపెనీ అతడిని కార్యాలయానికి తిరిగి రావాలని కోరడంతో ఉద్యోగం వదులుకోవాలని నిశ్చయించుకున్నాడు. అయితే దీనివల్ల ఆ వ్యక్తి 1.7 కోట్ల మేర విలువైన కంపెనీ స్టాక్స్ వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఉద్యోగి ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.

కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ నిబంధన ప్రకారం దేశాలను దాటి మరోచోటికి తరలాల్సిన అవసరం ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థకు ఆ వ్యక్తి తెలిపాడు. న్యూయార్క్ లో తాను కలలుకన్న జీవితాన్ని వదిలి సియాటెల్ నగరానికి వెళ్లడం ఏమాత్రం ఇష్టలేదన్నాడు. అమెజాన్ లో పనిచేయడాన్ని తాను ఆస్వాదించినట్లు చెప్పాడు. ఒకవేళ కంపెనీ గనుక వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విషయంలో బలవంతం చేయకపోతే అక్కడే పనిచేయడానికి సిద్ధమన్నాడు.
ఈ విషయంపై కంపెనీతో చర్చలు జరపడానికి ప్రయత్నించినట్లు అతడు వెల్లడించాడు. తాను సియాటెల్ కు మకాం మార్చేందుకు దాదాపు 1.2 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, పునరావాస ప్యాకేజీ ఉందా అని ఆరా తీసేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. అయితే కంపెనీ నుంచి సమాధానం రాలేదన్నాడు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పేరిట ఉద్ధేశపూర్వకంగానే సిబ్బందిని వదిలించుకోవాలని అమెజాన్ చూస్తోందని ఆరోపించాడు.


Click it and Unblock the Notifications