Amazon News: 'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' అని లలిత జ్యూయలర్స్ అధినేత టీవీలో చెప్పే యాడ్ దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఆయన అన్నది నిజమే. ఏ పనీ చేయకుండా, కష్టపడకుండా రూపాయి సంపాదించడం దాదాపు అసాధ్యమే. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎంతో అనాలసిస్ చేయాల్సి ఉంటుంది. అయితే అమెజాన్ ఉద్యోగి ఒకరు Xలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కష్టపడితేనే సంపాదన అనే సహజ సూత్రానికి విరుద్ధంగా ఉండటమే దీనికి కారణం.
'anpaure' అనే అకౌంట్ నుంచి షేర్ కాబడిన ఓ పోస్ట్ ఆసక్తిని కలిగిస్తోంది. 1.5 ఏళ్లుగా ఏ పనీ చేయకుండానే సంవత్సరానికి 3.10 కోట్లు వేతనం తీసుకున్నట్లు ఆ వ్యక్తి సోషల్ మీడియాలో తెలిపాడు. ఈ అదృష్టం ఇంకా ఎంత కాలం ఉంటుందో అంటూ వ్యాఖ్యానించాడు. అది ఏ చిన్న కంపెనీ నుంచో కాదు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్ సంస్థ నుంచే కావడం మరింత షాక్‌కు గురిచేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదని, మేనేజ్‌మెంట్ చూస్తూ కూర్చోదని కామెంట్ చేస్తున్నారు.

ఇటీవల గూగుల్ ప్రకటించిన లేఆఫ్స్ వల్ల ఉద్యోగం కోల్పోయిన అనంతరం అమెజాన్ లో సీనియర్ టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్ గా చేరినట్లు ఆ యూజర్ చెప్పుకొచ్చాడు. ఏ పనీ చేయకుండానే డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ కంపెనీలో చేరినట్లు వెల్లడించాడు. దీంతో తన స్టోరీ చెబుతూనే, కంపెనీలోని డొల్లతనాన్ని కూడా బయట పెట్టినట్లయింది. కాగా ఈ తరహా దిగ్గజ కంపెనీలు లే ఆఫ్స్ ఇవ్వడానికి ఇలాంటి వ్యక్తులే కారణమని సోషల్ మీడియా యూజర్లు విమర్శిస్తున్నారు.
ఇక తన పని గురించి వివరిస్తూ, అమెజాన్‌లో చేరిన ఈ ఏడాదిన్నర కాలంలో తాను కేవలం 7 సపోర్టు టికెట్లను మాత్రమే పరిష్కరించినట్లు తెలిపాడు. వీటితోపాటు 3 నెలలు కష్టపడిఒక ఆటోమేటెడ్ డాష్ బోర్డును తయారు చేసినట్లు కంపెనీకి చూపించానని వెల్లడించాడు. కానీ నిజం చెప్పాలంటే దాన్ని చాట్ జీపీటీ ఉపయోగించి కేవలం 3 రోజుల్లోనే రూపొందించవచ్చని స్పష్టం చేశాడు. కాగా తన రోజులో ఎక్కువ భాగం మీటింగ్ లతోనే సరిపోతున్నట్లు చెప్పుకొచ్చాడు. అందుకే గూగుల్ ఆ వ్యక్తికి లేఆఫ్స్ ఇచ్చి పంపించిందని పలువురు తిట్టిపోస్తున్నారు.


Click it and Unblock the Notifications