Work From Office: ఆఫీసులకు రావాల్సిందే.. ఉద్యోగులకు తేల్చి చెప్పిన అమెజాన్..
Amazon WFO: అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం చాలా మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో ఉద్యోగుల నుంచి ఉత్తమ పనితీరు కోరుతూ తిరిగి వర్క్ ఫ్రమ్ ఆఫీసు పద్ధతిని ప్రవేశపెడుతోంది.

కంపెనీ నిర్ణయం..
అమెరికా కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న అమెజాన్ తన ఉద్యోగులను పనిచేసేందుకు తిరిగి ఆఫీసులకు పిలిపిస్తోంది. కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ ఉద్యోగులను కార్యాలయాలకు తిరిగి రావాలని సూచించారు. మే 1 నుంచి వారానికి మూడు రోజులు తప్పక ఆఫీసుల నుంచి ఉద్యోగులు పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. దీనికి ముందు ఆఫీసులకు ఎవరు రావాలని నిర్ణయించే బాధ్యత కంపెనీలోని వ్యక్తిగత బృందాలకు ఉంది.

వారికి వెసులుబాటు..
కొత్తగా తీసుకొస్తున్న పాలసీలో సేల్స్, కస్టమర్ సపోర్ట్ వంటి ఉద్యోగులకు మాత్రం వెసులుబాటు ఉంటుందని జాస్సీ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెజాన్ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించటం అంత సులువైన పనేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయని సీఈవో ఉద్యోగులకు రాసిన ఈ-మెయిల్ లో వెల్లడించారు.

ఉద్యోగులకు అనుమానాలు..
కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులను ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు అమెజాన్ అనుమతించి దాదాపు 3 ఏళ్లు గడుస్తోంది. అయితే ప్రస్తుతం తెలుస్తున్న ఈ మార్పు ఎలా అమలు చేయబడుతుందనే దానిపై చాలా మంది ఉద్యోగులకు ప్రశ్నలు, అనుమానాలు ఉంటాయని తనకు తెలుసునని సీఈవో అన్నారు.
రానున్న వారాల్లో దానికి సంబంధించిన వివరాలను ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు ఆఫీసుల్లో ఉండటం వల్ల వారు సహోద్యోగులతో కలవటం, కంపెనీ సంస్కృతిని నేర్చుకోవటం, ట్రైన్ చేయటం వంటి అనేక పనులు సులువుగా మారతాయని సీఈవో అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications