ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ క్రమంగా తన లాజిస్టిక్ సేవలను పెంచుతోంది. గత దశాబ్దకాలంగా లాజిస్టిక్ సేవలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలోని అమెజాన్ ప్యాకేజీల్లోని సగానికి పైగా వస్తువులను సొంతగా డెలివరీ చేసుకుంటున్నట్లు మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. అమెజాన్ తన వస్తువులను సగానికి పైగా డెలివరీ చేసుకుంటూ ఫెడెక్స్, యూపీఎస్ వంటి కొరియర్ సంస్థలకు సీరియస్ రైవల్‌గా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దిగ్గజాలను దాటనున్న అమెజాన్
వస్తువులను సరఫరా చేసేందుకు అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముఖ్య నగర ప్రాంతాల్లో 50 శాతానికి పైగా తమ ఆర్డర్లను తాతమే సరఫరా చేసుకోవడానికి జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ చర్యలు తీసుకుంటోందట. ఇది కొరియర్ సంస్థలకు పెద్ద దెబ్బే. అమెజాన్ సొంత సరఫరా సంస్థ అమెజాన్ లాజిస్టిక్స్ త్వరలో అమెరికాలోని యూపీఎస్, ఫెడెక్స్ వంటి దిగ్గజాలను అధిగమిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.

6.5 బిలియన్లకు చేరుకోనున్న అమెజాన్ డెలివరీలు
గ్రామీణ ప్రాంతాలకు తమ వస్తువులను చేరవేసేందుకు ఇప్పటి వరకు ఇతర కొరియర్ సంస్థల పైన ఆధారపడుతోంది అమెజాన్. ప్రస్తుతం అమెరికాలో 2.5 బిలియన్ డెలివరీలను అమెజాన్ సరఫరా చేస్తుండగా, ఫెడెక్స్ 3 బిలియన్ డెలివరీలను, యూపీఎస్ 4.7 బిలియన్ డెలివరీలను చేస్తోంది. అయితే 2022 వరకు అమెజాన్ డెలివరీలు 6.5 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.

రెండు రెట్లు పెరిగింది
అమెజాన్ సొంత డెలివరీల సంఖ్య గత ఏడాది రెండు రెట్ల కంటే ఎక్కువగా పెరిగింది. 20 శాతం నుంచి 46 శాతానికి చేరుకుంది. కస్టమర్లకు వస్తువులను మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశ్యంతో వాయు మార్గ రవాణాలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లుగా జెఫ్ బెజోస్ ఇటీవల తెలిపారు.

అమెరికాలో అమెజాన్ డెలివరీస్...
అమెజాన్ డెలివరీలు సబర్బన్ ఏరియాల్లో 61 శాతం, అర్బన్ ప్రాంతాల్లో 28 శాతం, రూరల్ ఏరియాల్లో 11 శాతాన్ని ఆక్రమించాయి. అదే సమయంలో ఫెడెక్స్, యూపీఎస్ రూరల్ ప్రాంతాల్లో 20 శాతం ఆక్రమించాయి.


Click it and Unblock the Notifications