అమరావతి క్వాంటం వ్యాలీ.. టెక్నాలజీ రంగంలో సరికొత్త విప్లవం..పూర్తి వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన శాస్త్ర-సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో Amaravati Quantum Valley ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. క్వాంటం పరిశోధన, ప్రతిభాభివృద్ధి, పరిశ్రమ-విద్యాసంస్థల సహకారం కోసం సమగ్ర పర్యావరణ వ్యవస్థను నిర్మించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యంగా చెప్పుకోవచ్చు. సైన్స్ & టెక్నాలజీలో దేశం నిర్దేశించుకున్న జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.ఈ ప్రాజెక్టు రాకతో రాష్ట్రం అధునాతన శాస్త్రీయ మౌలిక సదుపాయాల అమలు దశలోకి అధికారికంగా అడుగుపెడుతోంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు. భారత సాంకేతిక రంగానికి చెందిన అగ్రశ్రేణి ప్రతినిధులు హాజరవుతున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ గుర్తింపు (Brand Identity) ఆవిష్కరణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. క్వాంటం పరిశోధన, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించే బహుమతి అవార్డుల ప్రకటన కూడా జరగనుంది. అంతేకాదు.. IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భాగస్వామ్యంతో క్వాంటం క్లౌడ్ సేవల ప్రారంభం రాష్ట్రంలో క్వాంటం టెక్నాలజీ వినియోగానికి కొత్త దిశను చూపించనుంది.

IBM-TCS సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్, ప్రతిభను తయారు చేసే క్వాంటం టాలెంట్ హబ్, అలాగే SRM విశ్వవిద్యాలయం నేతృత్వంలో ఏర్పాటుకానున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ముఖ్యమైనవిగా నిలవనున్నాయి. అదనంగా QClairvoyance Quantum Labs అభివృద్ధి చేసిన క్వాంటం సేఫ్ అప్లికేషన్ ప్రారంభం జరగనుంది. తొమ్మిది టెక్నాలజీ కంపెనీలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా ప్రైవేట్ రంగ భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది.
ప్రతిభాభివృద్ధి, వ్యవస్థాపకతకు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్‌లో పాల్గొంటున్న విద్యార్థులతో ప్రముఖులు సంభాషించి, క్వాంటం టెక్నాలజీపై వారి ఆలోచనలను తెలుసుకోనున్నారు. మేధా టవర్స్‌లో పనిచేస్తున్న ప్రారంభ దశ స్టార్టప్‌లతో పరస్పర చర్చల ద్వారా నైపుణ్యాభివృద్ధి, పరిశోధన సామర్థ్యం, సంస్థల సృష్టిపై దృష్టి సారించనున్నారు.
జాతీయ శాస్త్ర-సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు చెందిన అగ్రనేతలు అభయ్ కరండికర్, అజయ్ కుమార్ సూద్, వి. కామకోటి, హారిక్ విన్, అమిత్ సింఘీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర స్థాయి విధాన చట్రంలో క్వాంటం పరిశోధన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడం ద్వారా అమరావతి క్వాంటం వ్యాలీ భారతదేశ దీర్ఘకాలిక శాస్త్రీయ సామర్థ్యానికి దోహదపడటమే కాకుండా, ప్రభుత్వం-విద్యాసంస్థలు-పరిశ్రమల మధ్య బలమైన సహకారానికి పునాది వేయనుంది.


Click it and Unblock the Notifications