Amara Raja: అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ మహబూబ్‌నగర్ జిల్లాలో 16 GWh, 5 GWh వరకు అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ అండ్ బ్యాటరీ ప్యాక్‌లను ఉత్పత్తికి మెుట్టమెుదటి గిగా ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి గ్రీన్‌ఫీల్డ్ ఉత్పత్తి కేంద్రం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం 10 ఏళ్ల వ్యవధిలో రూ.9,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు అమర రాజా గ్రూప్ గతంలో తెలిపింది. శంకుస్థాపన వేడుక అధికారికంగా 'అమర రాజా గిగా కారిడార్' ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా దాదాపు 4,500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. అలాగే పరోక్ష ఉపాధి అవకాశాలు సైతం భారీగా పెరగనున్నాయి.

ఈ క్రమంలో మాట్లాడిన గల్లా జయదేవ్ తమ ప్రయాణంలో భూమి పూజ ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు. కేవలం గిగా కారిడార్ ఏర్పాటుకే పరిమితం కాకుండా స్థానిక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉద్యోగాలు కల్పించట అని వెల్లడించారు. తమ ప్రయాణంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది ఫోకస్ ఏరియాగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. అమర రాజా బ్యాటరీస్ తొలి లిథియం సెల్ అండ్ బ్యాటరీ ప్యాక్ తయారీ కేంద్రం ప్రారంభోత్సవ వేడుకను జరుపుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. దీనికి ముందు మహీంద్రా గ్రూప్ సైతం తమ ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీల ఉత్పత్తికి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications