Amara Raja Energy: తెలుగు రాష్ట్రాలకు చెందిన గల్లా ఫ్యామిలీ బ్యాటరీ కంపెనీ అమరరాజా స్టాక్ నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం కంపెనీ షేర్లు రాకెట్ లాగా దూసుకుపోతున్నాయి.
ఆటోమోటివ్ బ్యాటరీల తయారీ కంపెనీ అమర రాజా షేర్లు స్టాక్ మార్కెట్లలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఇంట్రాడేలో అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ షేర్లు 19 శాతం లాభపడి రూ.1,655.20 మార్కును అందుకున్నాయి. దీంతో నేడు స్టాక్ కొత్త గరిష్ఠాలను తాకింది. అయితే దీనికి కంపెనీ కుదుర్చుకున్న పెద్ద డీల్ కారణంగా తెలుస్తోంది. అమరరాజా తన పూర్తి యాజమాన్యంలోని సంస్థ అమరరాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లిథియం-అయాన్ సెల్స్ టెక్నాలజీ కోసం GIB ఎనర్జీ ఎక్స్ స్లోవేకియాతో లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడైంది.

అమరరాజా ఒప్పందం ప్రకారం ప్రపంచ స్థాయి ఎల్‌ఎఫ్‌పి సెల్స్ తయారు చేయడంలో సహాయపడుతుందని కంపెనీ వెల్లడించింది. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఐదింటిలో స్టాక్ లాభపడింది. 2014 తర్వాత అమర రాజాకి ఇది అత్యుత్తమ క్యాలెండర్ ఇయర్ పనితీరుగా నిలిచింది. ఒప్పందంలో భాగంగా GIB EnergyX లిథియం-అయాన్ కణాల కోసం గోషన్ ప్రపంచ-స్థాయి LFP సాంకేతికతను అమరరాజా సంస్థకు లైసెన్స్ చేస్తుంది. లైసెన్సింగ్ పరిధిలో సెల్ టెక్నాలజీ IPకి యాక్సెస్, న్యూ ఏజ్ సాంకేతికతలకు అనుగుణంగా గిగాఫ్యాక్టరీ సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో మద్దతు వంటి అంశాలు ఉన్నాయి.
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ షేర్లలో కేవలం 6 నెలల్లోనే ఇన్వెస్టర్ల సొమ్మును రెండింతలు చేసింది. ఈ కాలంలో స్టాక్ 113 శాతం రాబడిని అందించింది. 26 డిసెంబర్ 2023న అమర రాజా షేర్ల ధర ఒక్కోటి రూ.769.60 వద్ద ఉండగా.. జూన్ 25, 2024న కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.1,655.20 ధరకు చేరుకున్నాయి. అలాగే 2024లో ఇప్పటి వరకు అమర రాజా షేర్లు 95 శాతానికి పైగా పెరిగాయి. జూన్ 26, 2023న కంపెనీ షేర్లు రూ.645.20 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ట స్థాయి రూ.609.10 వద్ద ఉండగా నేడు కొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుకుంది.


Click it and Unblock the Notifications