Indian railways: భారతీయ రైల్వే సామర్థ్యం గురించి ఎంతగా చెప్పినా తక్కువే. ప్రపంచంలోని పలు రికార్డులు ఇండియన్ రైల్వేస్ సొంతం. సరుకు రవాణా రైళ్ల వేగాన్ని పెంచేందుకు ఆ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 300 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు రైల్వేల గూటికి చేరాయి. తద్వారా జాతీయ రవాణా సామర్థ్యం పెరగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పెరిగిన రవాణా సామర్థ్యం:
ఫ్రెంచ్ బహుళజాతి రోలింగ్ స్టాక్ తయారీదారు ఆల్స్టోమ్.. భారతీయ రైల్వేకు 300 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను డెలివరీ చేసినట్లు ప్రకటించింది. వీటి ద్వారా భారీ సరుకు రవాణా రైళ్లను అధిక వేగంతో నడిపించడానికి అవకాశం ఏర్పడుతోందని పేర్కొంది. తద్వారా రైల్వేల రవాణా సామర్థ్యం పెరుగుతుందని తెలిపింది.

6 వేల టన్నులు, 120 kmph:
3.5 బిలియన్ యూరోల విలువైన కాంట్రాక్టులో భాగంగా.. అల్‌స్టోమ్ 800 హై-పవర్డ్ డబుల్-సెక్షన్ లోకోమోటివ్‌లను సరుకు రవాణా సేవ కోసం సరఫరా చేస్తోంది. ఇవి 12,000 HP (9MW) చొప్పను సామర్థ్యం కలిగి ఉంటాయి. భారతీయ రైల్వే WAG-12Bగా గుర్తించిన ఈ లోకోలు.. గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 6 వేల టన్నుల రేక్‌లను లాగగలవు.
మంచి PPP వెంచర్‌కు ఉదాహరణ:
ఈ ప్రాముఖ్య ఘట్టానికి గుర్తుగా, నాగ్‌పూర్‌లోని ఆల్‌స్టోమ్ లోకోమోటివ్ మెయింటెనెన్స్ డిపో నుంచి 300వ ఇ-లోకోను సంస్థ ఫ్లాగ్ ఆఫ్ చేసింది. కాగా ఈ ఫెసిలిటీని ప్రధాని మోడీ గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించారు. "భారతీయ రైల్వేల సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడంలో ఆల్‌స్టోమ్ పాత్ర ప్రశంసనీయం. ఈ డీల్ విజయం.. మంచి ప్రభుత్వ, ప్రైవేట్ జాయింట్ వెంచర్ పనితీరుకు ఓ అద్భుత ఉదాహరణ" అని సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ నరేష్ లాల్వానీ అన్నారు.

ఇవీ డీల్ ప్రత్యేకతలు:
WAG-12B లోకోలను ఆల్‌స్టోమ్ మరియు ఇండియన్ రైల్వేల జాయింట్ వెంచర్ కింద మాధేపురా (బీహార్)లో నిర్మించబడుతున్నాయి. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రం కావడం విశేషం. దేశ రైల్వే రంగంలో ఇదే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రాజెక్ట్. ఇక్కడ సంవత్సరానికి 120 లోకోమోటివ్‌లను ఉత్పత్తి చేయవచ్చు. వీటి ఉత్పత్తితో, దేశీయంగా అధిక హార్స్‌పవర్ లోకోమోటివ్‌లను ఉత్పత్తి చేసే దేశాల క్లబ్‌లో ఇండియా చేరింది. ప్రపంచంలో ఈ ఫీట్ సాధించిన 6వ దేశంగా భారత్ కీర్తి గడించింది.


Click it and Unblock the Notifications