అమెరికాలో 2008 గృహ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైఖేల్ బర్రీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సారి ఆయన గూగుల్ మీద విరుచుకుపడ్డాడు. గూగుల్ యాజమాన్యంలోని ఆల్ఫాబెట్ ఇంక్ భారీ మొత్తంలో నిధుల సమీకరణకు బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభించడంపై బాంబు పేల్చాడు. ఆల్ఫాబెట్ విడుదల చేయబోయే బాండ్లలో సాధారణ కాలపరిమితి ఉన్నవే కాకుండా.. ఒకటి మాత్రం దాదాపు 100 సంవత్సరాల కాలపరిమితితో..అంటే 2066లో పరిపక్వత పొందేలా ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ బాండ్ల ద్వారా కంపెనీ అమెరికన్ డాలర్లు, బ్రిటిష్ పౌండ్లు, స్విస్ ఫ్రాంక్‌లలో రుణాలు సమీకరించాలని యోచిస్తోంది.
ఈ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే...బర్రీ దీనిని గతంలో జరిగిన ఒక ప్రసిద్ధ కార్పొరేట్ ఉదాహరణతో పోల్చుతూ స్పందించాడు. ఎంత పెద్దది, ఎంత శక్తివంతమైనదైనా ఏ కంపెనీ ఆధిపత్యం శాశ్వతం కాదంటూ బర్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్టు చేస్తూ, బర్రీ ఒకప్పుడు అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన కంపెనీలలో ఒకటైన మోటరోలాను ఉదాహరణగా ప్రస్తావించాడు.

1990ల చివర్లో మోటరోలా మార్కెట్ విలువ.. అమ్మకాల పరంగా టాప్ 25 అమెరికన్ కంపెనీల్లో ఒకటిగా ఉండేది. అప్పట్లో దాని బ్రాండ్ విలువ మైక్రోసాఫ్ట్ కంటే కూడా ఎక్కువగా ఉండటం గమనార్హం.అంతటి విశ్వాసంతోనే మోటరోలా కూడా ఒకసారి 100 సంవత్సరాల బాండ్‌ను జారీ చేసింది. ఇది కంపెనీ తన భవిష్యత్తుపై ఎంత నమ్మకం పెట్టుకుందో చూపించే నిర్ణయం. అయితే ఆ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొబైల్ ఫోన్ మార్కెట్‌లో నోకియా వంటి కంపెనీల పోటీ పెరిగింది. ఆపై ఆపిల్ ఐఫోన్ ప్రవేశంతో మోటరోలా మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోయింది.
ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన కంపెనీ.. నేడు తన గరిష్ట స్థాయి నుంచి మార్కెట్ విలువ, అమ్మకాల పరంగా భారీగా క్షీణించింది. ప్రస్తుతం మోటరోలా కేవలం సుమారు 11 బిలియన్ డాలర్ల అమ్మకాలతో 232వ స్థానంలో ఉందని మైఖేల్ బర్రీ తెలిపాడు. అయితే గూగుల్ రేపే విఫలమవుతుందని బర్రీ చెప్పడం లేదు. అత్యంత దీర్ఘకాలిక రుణాలు తీసుకోవడం ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, దశాబ్దాల తర్వాత ఒక కంపెనీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ అంచనా వేయడం సాధ్యం కాదు. మోటరోలా కూడా ఒకప్పుడు ఆపలేనిదిగా కనిపించింది. కానీ చరిత్ర దాని దిశను పూర్తిగా మార్చేసిందని చెప్పుకొచ్చాడు.
ఈ వ్యాఖ్యలు వస్తున్న సమయంలో Alphabet సహా అమెజాన్, మెటా వంటి పెద్ద టెక్ కంపెనీలు కృత్రిమ మేధస్సు (AI) కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. డేటా సెంటర్లు, అధునాతన కంప్యూటింగ్ శక్తి కోసం వేల కోట్ల డాలర్లు ఖర్చు అవుతున్నాయి. అయితే, ఈ AI మౌలిక సదుపాయాలు అనుకున్నదానికంటే వేగంగా పాతబడిపోతాయని బర్రీ హెచ్చరిస్తున్నారు. ఎన్విడియా తయారు చేసే AI చిప్‌ల చుట్టూ ఉన్న హైప్ కూడా ఎక్కువ కాలం నిలవకపోవచ్చని ఆయన అభిప్రాయం. ఈ బూమ్ తగ్గినప్పుడు, నేటి భారీ పెట్టుబడులు రేపటి నిరాశగా మారవచ్చని చెబుతున్నారు.
బర్రీ ప్రకారం.. AIకి ఎదురయ్యే అతిపెద్ద సవాలు విద్యుత్ సరఫరా. డేటా సెంటర్లు, హైటెక్ ఫ్యాక్టరీలకు సరిపడ శక్తి అందించాలంటే, అమెరికా సుమారు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన చిన్న అణు రియాక్టర్లలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఇది చైనాపై టెక్నాలజీ ఆధిపత్యాన్ని నిలబెట్టేందుకు అవసరమని భావిస్తున్నారు. నెమ్మదిగా జరిగే అనుమతులు, నియమాలు ఈ ప్రణాళికను దెబ్బతీయవచ్చని బర్రీ హెచ్చరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్, జెడి వాన్స్ వంటి నాయకులు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.


Click it and Unblock the Notifications