కరోనా ఎఫెక్ట్: త్వరలో వడ్డీ రేట్ల తగ్గింపు, ఆర్బీఐ గవర్నర్ హింట్?
ముంబై: కరోనా ప్రభావం నేపథ్యంలో వివిధ దేశాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. సోమవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశానికి ముందు.. వడ్డీ రేట్ల తగ్గింపు కోసమేనని అందరూ భావించారు. కానీ యస్ బ్యాంకు, కరోనా వైరస్ ప్రభావం, తీసుకునే చర్యలపై ఆయన మాట్లాడారు. వడ్డీరేటు తగ్గింపు మాత్రం జరగలేదు. అయితే త్వరలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది.
ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గించనప్పటికీ త్వరలో తగ్గుతాయని ఆర్బీఐ గవర్నర్ సంకేతాలు ఇచ్చారు. మార్చి 31 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగే మానిటరీ పాలసీ సమావేశం కంటే ముందే వడ్డీ రేట్లు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఓ విలేకరి ప్రశ్నించగా.. రేట్ కట్ సహా అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వడ్డీ రేట్లు తగ్గించినా తగ్గించకపోయినా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక వ్యవస్థకు పుష్కలంగా లిక్విడిటీ ఉందని చెప్పారు.

తాము ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారించామని శక్తికాంత దాస్ చెప్పారు. ఒకటి యస్ బ్యాంకు రెండు కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రభావితం కావడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. మార్చి 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు యస్ బ్యాంకుపై మారటోరియం ఎత్తివేస్తామన్నారు. మార్చి 26వ తేదీన కొత్త బోర్డు బాధ్యతలు తీసుకుంటుందన్నారు. అవసరమైతే యస్ బ్యాంకుకు మద్దతిస్తామన్నారు. యస్ బ్యాంకు కస్టమర్లు ఆందోళనతో మనీ విత్ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. యస్ బ్యాంకును తిరిగి పట్టాలెక్కిస్తామన్నారు.
కరోనావైరస్ మహమ్మారికి ప్రస్తుతం మందులేదని, ఇప్పటికే వందకు పైగా కేసులు నమోదయ్యాయని, కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. కరోనా వాణిజ్యంపై భారీ ప్రభావం చూపుతోందన్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందన్నారు. వృద్ధిపై ప్రభావం చూపుతుందన్నారు. కరోనా కారణంగా పర్యాటకరంగం, విమానయాన సంస్థలు, హాస్పిటాలిటీ రంగం, డొమెస్టిక్ ట్రేడ్ అండ్ ట్రాన్సుపోర్ట్ తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపిందని శక్తికాంతదాస్ అన్నారు.


Click it and Unblock the Notifications