అమెరికా-చైనా టెక్ వార్.. అలీబాబా, బైడు, BYDలకు అమెరికా బిగ్ షాక్.. US మిలిటరీ కంపెనీల బ్లాక్‌లిస్ట్‌లో..
బీజింగ్ సైనిక ఆశయాలకు, చైనా రక్షణ రంగానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయనే తీవ్ర ఆరోపణలతో చైనాకు చెందిన మూడు ప్రముఖ దిగ్గజ కార్పొరేట్ సంస్థలైన అలీబాబా (Alibaba), బైడు (Baidu) , ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ (BYD)లను అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) అధికారికంగా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)తో సంబంధాలు కలిగి ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల జాతీయ భద్రతా జాబితాను (1260H జాబితా) పెంటగాన్ నవీకరించింది. తాజా విస్తరణతో ఈ వివాదాస్పద భద్రతా జాబితాలో చేరిన చైనా కంపెనీల మొత్తం సంఖ్య గతంలో ఉన్న 130 నుండి ఒక్కసారిగా 188కి చేరింది.
వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించుకునే వ్యూహాత్మక లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో బీజింగ్‌లో శిఖరాగ్ర చర్చలు జరిపిన కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే వాషింగ్టన్ నుండి ఈ కఠిన నిర్ణయం వెలువడటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రదేశాల మధ్య దౌత్యపరమైన సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ, అధునాతన సాంకేతికతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), , కీలకమైన గ్లోబల్ సరఫరా గొలుసులపై (Supply Chains) ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పోటీ కొనసాగుతోందని పెంటగాన్ తాజా చర్య స్పష్టం చేస్తోంది.

ఈ జాబితాలో చేరినంత మాత్రాన అమెరికాలో సదరు కంపెనీల వాణిజ్య కార్యకలాపాలపై తక్షణమే పూర్తి నిషేధం లేదా కఠిన ఆంక్షలు అమలు కాకపోయినప్పటికీ, అంతర్జాతీయంగా వాటి కార్పొరేట్ ప్రతిష్టకు ఇది తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఈ హోదా పొందిన సంస్థలు అమెరికా సైన్యానికి సంబంధించిన రక్షణ కాంట్రాక్టులను దక్కించుకునే అవకాశాన్ని కోల్పోతాయి, అలాగే ఫెడరల్ పరిశోధన నిధుల (Research funding) పరిమితులను ఎదుర్కొంటాయి.
భవిష్యత్తులో అమెరికా విధించబోయే కఠినమైన వాణిజ్య, పెట్టుబడి ఆంక్షలకు ఈ హోదానే పునాదిగా భావిస్తారు. పెంటగాన్ నిర్ణయం వెలువడిన వెంటనే న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో అలీబాబా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ADRs) 1 శాతం క్షీణించి $119.84 కు, బైడు షేర్లు 2.1 శాతం తగ్గి $119.14 కు పడిపోగా, BYD షేర్లు కూడా నష్టాలను చవిచూశాయి. 2025లో ఈ జాబితాలో చేరిన టెన్సెంట్ హోల్డింగ్స్ (Tencent) హోదాను కూడా పెంటగాన్ పునరుద్ఘాటించింది. దీనివల్ల చైనాలోని అగ్రశ్రేణి ఏఐ టెక్నాలజీ కంపెనీలన్నీ ఇప్పుడు అమెరికా రక్షణ శాఖ నిఘా నీడలోకి వెళ్లినట్లయింది.
అలీబాబా, బైడు, BYD సంస్థలకు చైనా సైన్యంతో నేరుగా ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ, దేశ సాంకేతిక , పారిశ్రామిక రంగాన్ని పర్యవేక్షించే 'చైనా పరిశ్రమ , సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ'తో ఈ సంస్థలకు ఉన్న అనుబంధమే వీటిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడానికి ప్రధాన కారణమని పెంటగాన్ సమర్థించుకుంది. చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న "సైనిక-పౌర సమ్మేళనం" (Military-Civil Fusion) విధానం ప్రకారం అక్కడ పనిచేసే ప్రైవేట్ సంస్థలు తమ సాంకేతికతను, సామర్థ్యాలను చైనా సాయుధ దళాల బలోపేతానికి అప్పగించడం తప్పనిసరి. ఈ నిబంధన కారణంగా అమెరికాలో వాణిజ్య ఉనికిని కలిగి ఉన్న ఏ చైనా కంపెనీనైనా బీజింగ్ ప్రభుత్వం తన సైనిక అవసరాల కోసం వాడుకునే ప్రమాదం ఉందని వాషింగ్టన్ వాదిస్తోంది.
గత ఫిబ్రవరిలో ఎటువంటి ముందస్తు వివరణ లేకుండా జాబితా నుండి కొద్ది నిమిషాల వ్యవధిలోనే తొలగించబడిన చైనాకు చెందిన రెండు ప్రముఖ మెమరీ చిప్ తయారీ సంస్థలైన చాంగ్‌క్సిన్ మెమరీ టెక్నాలజీస్ (CXMT) , యాంగ్జీ మెమరీ టెక్నాలజీస్ (YMTC)లను పెంటగాన్ ఈ జూన్ అప్‌డేట్‌లో తిరిగి చేర్చింది. ట్రంప్-షీ జిన్‌పింగ్ శిఖరాగ్ర భేటీకి ముందు వీటిని తొలగించడం వల్ల అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్, ఎస్కే హైనిక్స్ , అమెరికాకు చెందిన మైక్రాన్ కంపెనీలకు నష్టం వాటిల్లి, చైనా చిప్ తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని జాతీయ భద్రతా అధికారులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. అలాగే, ప్రముఖ అంతర్జాతీయ రియాలిటీ షో 'అమెరికాస్ గాట్ టాలెంట్'లో తన నృత్యం చేసే రోబోట్లతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్న చైనీస్ రోబోటిక్స్ సంస్థ 'యూనిట్రీ' (Unitree)ని కూడా పెంటగాన్ ఈ జాబితాలో చేర్చింది. ఈ కంపెనీ చైనా ప్రభుత్వం నుండి వ్యూహాత్మక సహాయం పొందుతోందని అమెరికా పేర్కొంది.
ఈ పరిణామంపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అమెరికా తన జాతీయ భద్రత అనే భావనను అతిగా వక్రీకరిస్తూ, చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకుని వివక్షాపూరితమైన పద్ధతులను అవలంబిస్తోందని ఆరోపించింది. చైనా వ్యాపారాలకు నిష్పక్షపాతమైన, న్యాయమైన వ్యాపార వాతావరణాన్ని కల్పించాలని డిమాండ్ చేసింది. అటు టెన్సెంట్ కంపెనీ తరపున లాబీయింగ్ చేస్తున్న ట్రంప్ వైట్ హౌస్ మాజీ అధికారి జాన్ మెకెంటీ సైతం పెంటగాన్ తర్కాన్ని తప్పుబడుతూ, BYD లాంటి కార్ల తయారీ సంస్థలను ఈ జాబితాలోకి లాగడం హాస్యాస్పదమని, ఈ లెక్కన అమెరికాకు చెందిన ఫోర్డ్, జీఎం (GM) కంపెనీలను కూడా అమెరికన్ సైనిక కంపెనీలుగా వర్గీకరించాల్సి వస్తుందని విమర్శించారు.
కాగా, గృహ వినియోగ వైర్‌లెస్ రౌటర్ల మార్కెట్లో ఉన్న చైనా ఆధారిత 'టిపి-లింక్ టెక్నాలజీస్' (TP-Link Technologies)ను ఈ జాబితాలో చేర్చడంపై అమెరికా ప్రధాన కార్యాలయంగా ఉన్న 'టిపి-లింక్ సిస్టమ్స్' స్పందిస్తూ.. తాము కాలిఫోర్నియా చట్టాల ప్రకారం పనిచేసే యూఎస్ కంపెనీ అని, తమ సీఈఓకు చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని, ఈ పరిమితులు తమకు వర్తించవని స్పష్టత ఇచ్చింది.


Click it and Unblock the Notifications
