Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు ఇల్లు కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!
అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం ఒక సంప్రదాయం. అయితే, ప్రస్తుత కాలంలో చాలామంది పసిడి కంటే స్థిరాస్తి (Real Estate) పై పెట్టుబడి పెట్టడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఈ శుభ ముహూర్తాన ఇల్లు లేదా స్థలం కొనాలనుకునే వారు గుడ్డిగా కాకుండా, కొన్ని కీలక విషయాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
భారతీయ సంస్కృతిలో అక్షయ తృతియ (Akshaya Tritiya) కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున చేసే ఏ చిన్న ప్రారంభమైనా భవిష్యత్తులో అద్భుతమైన వృద్ధిని ఇస్తుందని మన నమ్మకం. అందుకే గతంలో కేవలం బంగారానికే పరిమితమైన ఈ సెంటిమెంట్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వైపు మళ్లుతోంది. ఇల్లు లేదా స్థలం అనేది కేవలం తలదాచుకునే చోటు మాత్రమే కాదు, అది తరతరాలకు నిలిచిపోయే ఆస్తి. అయితే, పండుగ ఉత్సాహంలో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఈ క్రింది విషయాలను తప్పక గమనించాలి.

1. పత్రాల పరిశీలన (Documents & RERA)
ముహూర్తం ఎంత బాగున్నా, కాగితాలు సక్రమంగా లేకపోతే ఇబ్బందులు తప్పవు. కొనే ఆస్తికి రేరా (RERA) రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది ముందుగా తనిఖీ చేయాలి. అలాగే భూమి టైటిల్ క్లియర్ గా ఉందా? గతంలో ఎటువంటి వివాదాలు లేవు కదా? అని లీగల్ గా సరిచూసుకోవాలి. బిల్డర్ ట్రాక్ రికార్డ్, వారు గతంలో పూర్తి చేసిన ప్రాజెక్టుల నాణ్యతను కూడా బేరీజు వేయాలి.
2. లొకేషన్ , ఫ్యూచర్ గ్రోత్
పండుగ ఆఫర్లు ఇస్తున్నారని ఎక్కడో మారుమూల ప్రాంతంలో ప్రాపర్టీ కొనడం తెలివైన పని కాదు. రవాణా సౌకర్యాలు, మెట్రో కనెక్టివిటీ, స్కూళ్లు , ఆసుపత్రులు దగ్గరలో ఉన్నాయో లేదో చూడాలి. మీరు నివసించడానికి కొంటున్నారా లేదా ఇన్వెస్ట్‌మెంట్ కోసమా అనే దానిపై స్పష్టత ఉండాలి. భవిష్యత్తులో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం వల్ల మీ పెట్టుబడికి రెట్టింపు లాభం లభిస్తుంది.
3. ఆఫర్ల వెనుక ఉన్న నిజం
అక్షయ తృతీయ సందర్భంగా డెవలపర్లు డిస్కౌంట్లు, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్లు అంటూ రకరకాల ప్రకటనలు ఇస్తుంటారు. ఈ పరిమిత కాల ఆఫర్లను చూసి ప్రాపర్టీ అసలు ధరను విస్మరించకూడదు. జీఎస్టీ (GST), రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మెయింటెనెన్స్ వంటి అదనపు ఖర్చులన్నింటినీ కలిపి లెక్క వేసుకోవాలి.
4. దీర్ఘకాలిక ఆలోచన
స్థిరాస్తి పెట్టుబడి అనేది రాత్రికి రాత్రే లాభాలు ఇచ్చేది కాదు. ముఖ్యంగా భూమిపై పెట్టుబడి పెట్టేవారు కనీసం 10 నుండి 15 ఏళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అప్పటికి ఆ ప్రాంతం ఎలా మారుతుందో ఊహించి పెట్టుబడి పెట్టడం వల్ల 'కాంపౌండింగ్' ప్రయోజనం పొందవచ్చు. ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల కంటే, అభివృద్ధికి చేరువలో ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం స్మార్ట్ మూవ్ అనిపించుకుంటుంది.
5. ఉత్సాహంతో పాటు అప్రమత్తత కూడా..
అక్షయ తృతీయ (Akshaya tritiya) నాడు కొత్త ఆస్తిని కొనుగోలు చేయడం ఆర్థికంగా , మానసికంగా గొప్ప నిర్ణయమే. కానీ, అది మీ జీవితకాల కష్టం కాబట్టి, సెంటిమెంట్‌తో పాటు సరైన సమాచారాన్ని (Informed Choice) కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకుని కొన్న ఆస్తి మాత్రమే మీకు నిజమైన అక్షయ సంపదను ఇస్తుంది. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సుస్థిరమైన ఆస్తిని, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications