నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' (Akhanda 2) సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో.. టికెట్ ధరల విషయంలో వచ్చిన ట్విస్ట్ అటు ప్రేక్షకులను, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రీమియర్ షోలతో పాటు మొదటి 10 రోజుల షోల కోసం టికెట్ ధరలను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సినిమా నిర్మాతలకు గతంలో అనుమతి ఇచ్చింది. దీని ఆధారంగా, అభిమానులు ఉత్సాహంగా అధిక ధరలకు.. సుమారు రూ.600 పెట్టి.. టికెట్లు కొనుగోలు చేశారు. తీరా చూస్తే ఇప్పుడు హైకోర్ట్ షాక్ ఇచ్చింది.

హైకోర్టు షాక్: పెరిగిన ధరలకు బ్రేక్!
సినిమా విడుదల అవ్వనున్న తరుణంలో పెంచిన టికెట్ ధరలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో థియేటర్ల యజమానులు పెంచిన ధరలను అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ అడ్డంకి సినిమా యొక్క ప్రారంభ వసూళ్లపై ముఖ్యంగా ప్రీమియర్ షోల ఆదాయ లక్ష్యాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరి ఆల్రెడీ టికెట్లు కొన్నవారికి న్యాయం ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితి.
రీఫండ్ ఇస్తారా?
ఇప్పుడు రూ. 600 చెల్లించి టికెట్ కొన్న ప్రేక్షకులకు ఒక పెద్ద ప్రశ్న ఎదురైంది. వీళ్లు చెల్లించిన అదనపు మొత్తం తిరిగి చెల్లిస్తారా? లేదా హైకోర్టు ఆదేశాలు కేవలం భవిష్యత్తు షోలకు మాత్రమే వర్తిస్తాయా? అనే విషయంలో థియేటర్ల వైపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అధిక ధరలు చెల్లించిన ప్రేక్షకులకు రీఫండ్ అంశంపై స్పష్టత లేకపోవడంతో.. టికెట్ కొనుగోలుదారులు తీవ్ర గందరగోళంలో ఉన్నారు.
తగ్గింపు రేట్లతో మరో సినిమా..
ఈ గందరగోళం మధ్య ఈ వారం విడుదల కానున్న మరో తెలుగు చిత్రం 'మౌగ్లీ' అనుసరించిన వ్యాపార వ్యూహం చర్చనీయాంశంగా మారింది. 'మౌగ్లీ' నిర్మాతలు సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరను కేవలం రూ.99 గా నిర్ణయించారు. ఒకవైపు Akhanda 2 అధిక ధరల వివాదంలో చిక్కుకోగా.. మరోవైపు రూ.99 టికెట్ వ్యూహం అనుసరించడం వల్ల 'మౌగ్లీ' సినిమా అభిమానులను ఆకర్షించి.. ఈ పోటీని తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ న్యాయపరమైన ట్విస్ట్ తెలుగు సినిమా మార్కెట్‌లో ఊహించని పరిణామాలకు దారితీసిందనే చెప్పాలి.
ధరల పెంపు వివాదాలకు ముగింపు ఎప్పుడో..?
నిజానికి తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు వివాదం కొత్తేమీ కాదు. గత కొన్నేళ్లుగా ముఖ్యంగా పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదలైనప్పుడు ప్రీమియర్ షోలు, మొదటి వారం ప్రదర్శనల కోసం టికెట్ ధరలు పెంచడం ఒక సాధారణ బిజినెస్ ట్రిక్ గా మారింది. అయితే ప్రభుత్వాలు జారీ చేసే ఉత్తర్వులను అనుసరించి ఈ ధరలు పెంచడం జరుగుతుంది. గతంలో కూడా కొన్ని సినిమాల విషయంలో అధిక ధరల వసూలుపై ప్రేక్షకుల నుండి న్యాయవాదుల నుండి పిటిషన్లు దాఖలయ్యాయి. యజమానులు ఆశించే లాభాలకు సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరలకు మధ్య సమతుల్యత లోపించడం వల్లే ఈ వివాదాలు ఉత్పన్నమవుతున్నాయి. మరి దీనికి ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications