Akasa: దేశీయ విమానయాన రంగం శర వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆయా ఎయిర్ లైన్స్ ఇటీవల వందలకొద్దీ ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టడమే ఇందుకు ఉదాహరణ. కాగా సరికొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించిన ఆకాశ ఎయిర్.. ప్రస్తుతం 4.2 శాతం మార్కెట్ వాటాతో కొనసాగుతోంది. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంటోంది.
రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పెట్టుబడి పెట్టిన ఆకాశ ఎయిర్ పెద్ద ప్లాన్ వేసింది. త్వరలో అంతర్జాతీయ రూట్స్ లో ప్రయాణించడానికి సిద్ధపడుతోంది. ఇందుకోసం మూడంకెల మేర ఎయిర్‌క్రాఫ్ట్స్ ను ఆర్డర్ పెట్టనున్నట్లు కంపెనీ CEO వినయ్ దూబే తెలిపారు. దీనికి తోడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకూ ప్రయత్నిస్తామని ప్రకటించారు.

ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీతో సహా 16 దేశీయ గమ్యస్థానాలకు ఆకాశ తన సేవలు అందిస్తోంది. ఈ 14 నెలల ఎెయిర్ లైన్స్ వారానికి 750 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. కాగా ఈ దశాబ్ధం చివరి నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(IPO)గా మార్కెట్లలో లిస్ట్ అయ్యేందుకు రెడీ అవుతోంది.
ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ సేవలను ప్రారంభించాలని చూస్తోంది. 76 బోయింగ్ 737 MAX విమానాల కోసం ఇప్పటికే ఆర్డర్ చేయగా.. 2027 మధ్య నాటికి ఇవి డెలివరీ అవుతాయని బావిస్తోంది. ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌కు 20 విమానాలు ఉన్నాయి. ఇక ఈ సామర్థ్యాన్ని మూడు అంకెల మేరకు పెంచుకునేందుకు 2023 చివరిలోపు కొత్త ఆర్డర్స్ పెట్టాలని చూస్తున్నట్లు CEO పేర్కొన్నారు.
"ఝన్‌ఝన్‌వాలా కుటుంబం పెట్టుబడులు ఉపసంహరించుకోనుంది అనే పుకార్లు వింటున్నాం. అవి అసంబద్ధమైనవి. వారు దీర్ఘకాలం మాతో ఉంటారు" అని దూబే స్పష్టం చేశారు. ఇటీవల దాదాపు 40 మంది పైలట్‌లు నిష్క్రమించేందుకు నోటీసు పీరియడ్ కోరడంతో గందరగోళం నెలకొంది. దీని ఫలితంగా కొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. సంబంధిత పైలట్‌లపై చట్టపరమైన చర్యలను సైతం ప్రారంభించింది.


Click it and Unblock the Notifications