Airtel News: జియోని ఓడించటానికి ఎయిర్‌టెల్ సిద్ధం..! రాకెట్ వేగంతో, ఇదిగో ప్రూఫ్..
Airtel Q2 Results: భారతీయ టెలికాం ప్రపంచంలో అగ్రస్థాయికి చేరుకుంది రిలయన్స్ జియో. రావటంతోనే 4జీ సేవలను దేశంలో అందుబాటులోకి తీసుకొస్తూ గడచిన 7 ఏళ్లుగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు ఇతర ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అంబానీ వేగానికి ముకుతాడు పడుతోంది.
ఈ క్రమంలోనే నేడు విడుదలైన భారతీ ఎయిర్ టెల్ ఫలితాలు టెలికాం రంగంలో మెుదలైన మార్పును సూచిస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం దాదాపు మూడింతలు పెరిగి రూ.3593 కోట్లుగా నమోదయ్యాయి. గడచిన ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.1341 కోట్లుగా ఉంది. అంటే ఏడాది ప్రాతిపదికన 167 శాతం పెరుగుదలను చూసింది. వాస్తవానికి టారిఫ్ రేట్లను పెంచటం కంపెనీ లాభదాయతను పెంచటంలో దోహదపడింది. మెుదట రీఛార్జ్ రేట్లను పెంచింది జియో అయినప్పటికీ.. జియోకు అదిపెద్ద చేటు చేసింది. జియో అనంత్ అంబానీ పెళ్లి తర్వాత టారిఫ్ రేట్లను పెంచటంతో భారీగా యూజర్లను కోల్పోతుండగా, బీఎస్ఎన్ఎస్, విఐ, ఎయిర్ టెల్ లాభపడుతున్నాయి. నెమ్మదిగా జియో నుంచి కస్టమర్లను లాక్కుంటూ చాపకింద నీరుగా ఈ కంపెనీలు విస్తరించటం ప్రారంభించాయి.

దేశీయంగా బలమైన వృద్ధితో సెప్టెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.41,473 కోట్లుగా నమోదైంది. ఇది బ్లూమ్ బర్గ్ అంచనాలను అధిగమించటం గమనార్హం. ఇదే క్రమంలో నేడు మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో రూ.1663.35 వద్ద స్థిరపడింది. రెండవ త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్ భారతదేశ వ్యాపారం ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించింది. త్రైమాసికంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ రూ.233గా ఉంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.203 వద్ద ఉంది.
ప్రస్తుతం కంపెనీ దేశీయ వినియోగదారుల సంఖ్య 4 కోట్లకు పైగా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లో కంపెనీ కస్టమర్ బేస్ 5.63 కోట్లుగా ఉన్నట్లు త్రైమాసిక ఫలితాల్లో వెల్లడించింది. ఆఫ్రికాలో వినియోగదారుల సంఖ్య 1.57 కోట్లుగా ఉంది. అలాగే ప్రస్తుతం ఇంటర్నెట్ సగటు వినియోగం ఒక్కో కస్టమర్ కు 23.9 జీబీగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 42 లక్షల మంది స్మార్ట్ ఫోన్ డేటా యాజర్లను అదనంగా పొందింది. ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్ విస్తరణను కూడా కొనసాగిస్తోంది. ఈ త్రైమాసికంలో దాదాపు 5,000 టవర్లు, 15,200 మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్టేషన్‌లను అదనంగా జోడించింది. ఎయిర్‌టెల్ కీలక ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి జూన్‌లో కొనుగోలు చేసిన కొత్త స్పెక్ట్రమ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది.
మొబైల్‌కు మించిన ఎయిర్‌టెల్ వ్యాపార విభాగాలు కూడా ఆరోగ్యకరమైన వృద్ధిని కనబరిచాయి. హోమ్స్ వ్యాపారం 17.3 శాతం రాబడి పెరుగుదలను నివేదించగా.. 5,83,000 కొత్త కస్టమర్‌ల చేరికతో దాని కస్టమర్ బేస్ 8.6 మిలియన్లకు చేరుకుంది. ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌పై దృష్టి సారించే ఎయిర్‌టెల్ వ్యాపారం ఏడాది ప్రాతిపదికన 10.7 శాతం ఆదాయం పెరిగింది. ఇదే క్రమంలో డిజిటల్ టీవీ మార్కెట్ మాత్రం అత్యల్పంగా 1 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇటీవలి వార్తల ప్రకారం ఎయిటెల్ డీటీహెచ్ టాటాలకు చెందిన టాటా ప్లే వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు చర్చలు కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. ఒకపక్క జియో కోటి మందికిపైగా కస్టమర్లను కోల్పోగా ఎయిర్ టెల్ మాత్రం కొత్త కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ బలమైన వ్యాపార వృద్ధిని చూస్తోంది.


Click it and Unblock the Notifications