Airtel: ఎయిర్‌టెల్ టాప్ మేనేజ్‌మెంట్ మార్పు.. స్టాక్ కుప్పకూలుతుందా..?
Airtel: ప్రస్తుతం భారత టెలికాం రంగంలో ఎన్నడూ లేనంత వార్ నడుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ జియోతో ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో అనేక కంపెనీలు ఇప్పటికే కనుమరుగు కాగా.. మిగిలినవి మనుగడకోసం పోరాడుతున్నాయి.
ఇలాంటి సమయంలో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ టాప్ మేనేజ్‌మెంట్‌లో పెద్ద మార్పులు జరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు వీటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. కంపెనీకి చెందిన బిజినెస్ సీఈవో అజయ్ చిట్కారా కంపెనీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడైంది. ఆగస్టు మూడో వారం వరకు ఆయన ప్రస్తుతం ఉన్న పదవిలో కొనసాగనున్నారు. మిగిలిన వ్యాపారం వాణి వెంకటేష్, గణేష్ లక్ష్మీనారాయణన్, ఆశిష్ అరోరా నేతృత్వంలో నిర్వహించబడుతోంది.

సీఈవో అజయ్ చిట్కారా నిష్క్రమణ గురించి ఎయిర్‌టెల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. తన వ్యాపారం మూడు వ్యాపార, ఛానెల్ విభాగాలుగా పనిచేస్తుందని టెల్కో అందులో వెల్లడించింది. గ్లోబల్ బిజినెస్ వాణీ వెంకటేష్ నేతృత్వంలో, దేశీయ వ్యాపారం గణేష్ లక్ష్మీనారాయణన్ నేతృత్వంలో, నెక్స్ట్రా డేటా సెంటర్‌కు ఆశిష్ అరోరా నాయకత్వం వహిస్తారని తెలిపింది. ఎయిర్‌టెల్ టెలికాం వ్యాపారం ముందుకు సాగటానికి అద్భుతమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని భారతీ ఎయిర్‌టెల్ MD & CEO గోపాల్ విట్టల్ వెల్లడించారు.

వ్యాపారాన్ని వృద్ధి బాటలో నడిపేందుకు వాణి, గణేష్, ఆశిష్‌లతో కలిసి పనిచేయాలని తాను ఎదురు చూస్తున్నానని గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. అజయ్ తన 23 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎయిర్‌టెల్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపారు. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ వ్యాపారాన్ని ఒక శక్తిగా మార్చారన్నారు. అలాగే భవిష్యత్ ప్రయత్నాలకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఎయిర్ టెల్ కంపెనీ షేర్లు సోమవారం బీఎస్ఈలో 0.52 శాతం క్షీణించి రూ.851.80 వద్ద ట్రేడింగ్ ముగించాయి. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4,75,359 కోట్లుగా ఉంది. అయితే మేనేజ్మెంట్ స్థాయిలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకోవటం షేర్లపై స్వల్ప కాలంలో ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications