Telecom news: జియో యానివర్సిరీ ఆఫర్‌కు ఎయిర్‌టెల్ కౌంటర్ ఆఫర్.. ఆ రీఛార్జ్‌లపై ఎక్స్‌ట్రా బెనిఫిట్స్
airtel: టెలికాం రంగంలో వివిధ ప్లేయర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ నువ్వానేనా అన్నట్లు కస్టమర్లను ఆకర్షించే పనిలో ఉన్నాయి. ఈ రెండూ ప్రైవేట్ రంగంలోనివి. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుండటంతో.. దానికి చెక్ పెట్టే దిశగా ఆ రెండు కంపెనీలు పావులు కదుపుతున్నాయి.
ఇప్పటికే వివధ నెట్‌వర్క్‌ల నుంచి BSNLకు భారీ స్థాయిలో వలసలు మొదలయ్యాయి. వాటిని నిలువరించేందుకు సదరు సంస్థలు యాక్షన్ ప్లాన్ షురూ చేశాయి.
8వ వార్షికోత్సవం సందర్భంగా జియో పలు ఆఫర్లు ప్రకటించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరో టెల్కో దిగ్గజం ఎయిర్‌టెల్ కూడా రంగంలోకి దిగింది. తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రచార ఆఫర్స్ స్టార్ట్ చేసింది.

మూడు ప్యాక్‌లతో కూడిన ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్‌లను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది. వాయిస్, డేటా మరియు OTT స్ట్రీమింగ్ సేవలపై కస్టమర్లకు ప్రయోజనాలు కల్పిస్తోంది. సెప్టెంబర్ 6 నుంచి 11 మధ్య చేసే రీఛార్జ్‌లకు మాత్రమే చెల్లుబాటు అయ్యే విధంగా షరతు విధించింది. అయితే కంపెనీ మాత్రం దేశంలో జరగబోయే గణేష్ ఉత్సవాల కోసమే ఈ ఆఫర్ అని చెబుతోంది.
979, 1029 మరియు 3599 ప్రీపెయిడ్ ప్యాక్‌లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. 979 ప్యాక్‌కి ప్రస్తుతం 2 GB డేటా/రోజు, అపరిమిత కాల్‌లు, Xstream ప్రీమియంపై 22+ OTT, 84 రోజుల చెల్లుబాటు ఉంది. కాగా కొత్త ఆఫర్‌లో భాగంగా దీనికి అదనంగా 28 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే 10 GB డేటా కూపన్‌ను లభిస్తుంది. అదేవిధంగా 1029 మరియు 3599 రీఛార్జ్‌లతో వినియోగదారులు ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంపై 22+ OTTని పొందుతారు. అదనంగా 28 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే 10 GB డేటా కూపన్ ప్రయోజనాలనూ ఎయిర్‌టెల్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications