వచ్చే అయిదేళ్ల కాలంలో ఎయిర్‌పోర్ట్స్ సెక్టార్‌లోకి రూ.90,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చునని విమాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ అన్నారు. ఇందులో రూ.68,000 కోట్ల వరకు ప్రయివేటు రంగం నుండి రానుండగా, రూ.22,000 కోట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పెట్టుబడి పెట్టనుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని జేవార్ వద్ద రూ.8,914 కోట్లతో నిర్మిస్తున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శంఖుస్థాపన చేస్తున్నారు.
ఈ విమానాశ్రయం 2024 సెప్టెంబర్ నాటికి ప్రారంభం కావచ్చునని అంచనా. ప్రస్తుతం దేశంలో 136 విమానాశ్రయాలు ఉన్నాయి. ఇందులో హెలీపోర్ట్స్, ఏరోడ్రోమ్స్ కూడా ఉన్నాయి. ఇవి అయిదేళ్లలో 220కి పెరగవచ్చని చెప్పారు. చాలా ఏరోడ్రోమ్స్ నిర్మాణం జరుగుతోందన్నారు.

గోవాలోని మోపాలో వచ్చే ఏడాది కొత్త విమానాశ్రయం సిద్దమవుతోందని, నేవీ ముంబైలో కొత్తది వస్తోందన్నారు. అలాగే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాల్లో విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం రోజువారీ విమాన ప్రయాణీకుల సంఖ్య కరోనా ముందస్తుస్థాయి 4 లక్షలకు సమీపిస్తోందన్నారు. గతంలోకంటే ఇప్పుడు మరింత వేగంగా విమానయానరంగం వృద్ధి చెందుతోందన్నారు.
ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎయిరిండియా ప్రయివేటీకరణకు బిడ్డింగ్‌లో టాటా గ్రూప్ విజయవంతమైన విషయం తెలిసిందే. ఎయిరిండియాను రూ.18,000 కోట్లకు విక్రయించేందుకు టాటా సన్స్‌తో కేంద్రం అక్టోబర్ 25వ తేదీన షేర్ పర్చేజ్ ఒప్పందంపై సంతకాలు చేసింది. ఎయిరిండియాకు నెలకు రూ.600 కోట్లకు పైగా నష్టం వస్తోందని చెప్పారు.


Click it and Unblock the Notifications